నాడు ‘లవ్’ స్టోరీ నేడు ‘కవ్’ స్టోరీ

రాజకీయం ఓ కళ. కానీ క్షుద్ర రాజకీయం ఒక నేరం. ఒకప్పుడు రెండూ వేరు వేరుగా వుండేవి. కానీ ఇప్పుడు కలసి పోయాయి. నేరస్తుడు కళాకారుడు కావచ్చు; కానీ కళా కారుడు నేరస్తుడు కాకూడదు. …

రాజకీయం ఓ కళ. కానీ క్షుద్ర రాజకీయం ఒక నేరం. ఒకప్పుడు రెండూ వేరు వేరుగా వుండేవి. కానీ ఇప్పుడు కలసి పోయాయి. నేరస్తుడు కళాకారుడు కావచ్చు; కానీ కళా కారుడు నేరస్తుడు కాకూడదు. 

జనం చైతన్యం పొందనంత వరకూ రెంటి మధ్య తేడాలను తెలుసుకోలేరు. అందుకే రెంటినీ కలగలిపి చూపగలుగుతారు. సహజమైన పవ్వుల్లో, ప్లాస్టిక్ పవ్వుల్ని పెట్టగలుగుతారు. కాబట్టే హేతువుకీ, విశ్వాసానికీ  మధ్య తేడాలు చెరిపేస్తారు; పుక్కిటి పురాణాలను చరిత్రలుగా వల్లె వేస్తారు, జ్యోతిషాన్నే ఖగోళశాస్త్రంగా చూపెడతారు. 

ఇక ఎన్నికలు ముందు కొస్తున్నాయంటే, వీరి నైపుణ్యానికి పని పెరిగి పోతుంది. ‘కాదేది రాజకీయానికి అనర్హం’ అన్నట్లు, దేన్ని చూపయినా భావోద్వేగాలు రేపగలరు. రాజకీయానికి బాగా పనికొచ్చే భావోద్వేగాలు రెండు. ఒకటి: ఆశ, రెండు: ద్వేషం. ఆశ మీద నడిపే రాజకీయం ఖరీదయి పోయింది. ‘అన్న’ కూడా వెళ్ళితే ‘బీబీ’ గ్యారంటీ అనుకున్నారనుకోండి. ఎంత ఖర్చు. బీబి అంటే ‘బీరూ, బిర్యానీ’ లెండి. దీనికి తోడు ‘రుణ మాఫీలూ’, ‘నరేగా’లూ, పలు ‘ఫ్రీ’లూ ఇవన్నీ ఆశ మీద పెట్టే ఖర్చులు. ద్వేషానికి పెద్ద ఖర్చు వుండదు. అనుకుంటాం గానీ, ‘అహింస’ కయిన ఖర్చు ‘హింస’కవుతుందా..? అందుకే రాజకీయం చవగ్గానూ, చవకబారుగానూ అయిపోవాలనుకునే వారు ‘హింస’ను ప్లాన్ చేస్తారు. తక్కువ వోట్లు వున్న వారికీ, ఎక్కువ వోట్లు వున్న వారికీ మధ్య చిచ్చు పెట్టి ‘హింస’ను ప్రేరేపిస్తే, ఎక్కువ వోట్లున్న వారు ‘ద్వేషం’తో రగిలిపోయి, తక్కువ వోట్లు వున్న వారిని ఎన్నికల్లో మట్టి కరిపించేస్తారు.  ‘భావోద్వేగం’ ఇట్టే కలిగిపోవాలనుకుంటే ‘మతం’ అనువైన మార్గం, అని వీరు భావిస్తారు. 

దేనికయినా మతం రంగు పులమవచ్చు. ‘లవ్వు’కీ పులమ వచ్చు ‘కౌ’వ్వు’(ఆవు)కీ పులమ వచ్చు. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ‘ముజఫర్ నగర్ అల్లర్ల’కు కారణం ఒక ‘లవ్ స్టోరీ’. ఒక ముస్లిం కుర్రాడు, హిందూ అమ్మాయిని ప్రేమిస్తే, ఏమవుతుంది? మహా అయితే మణిరత్నం తీసిన ‘ముంబయి’ లాంటి సినిమా అవ్వాలి. కానీ, అది అతి పెద్ద రాజకీయం అయింది. అమ్మాయి సోదరులు ముస్లిం కుర్రాడి మీద దాడి, తర్వాత ఆ అమ్మాయి తరపు వాళ్ళ ప్రతీదాడులు.. దాడులూ, ప్రతిదాడులూ.. ఇంకేముంది? హింస జరిగిపోయింది. అమ్మాయి బీసీ కులస్తురాలు. అక్కడి సమాజ్ వాదీ పార్టీ బీసీముస్లిం వోట్ల కలయిక మీద నిలబడి వుంటుంది. ‘కొద్ది సేపు, ఆమెను బీసీగా కాకుండా, హిందూ చూపగలిగితే రాజకీయం’ మారిపోతుందన్నది బీజేపీ వ్యూహకర్తల ఉద్దేశ్యం. వెంటనే ఈ ‘లవ్ స్టోరీ’ ని ‘లవ్ జిహాద్’ గా అభివర్ణించారు. (ప్రేమను కూడా ఒక బలాత్కారం గా చూడాలన్నది వారి ఈ వ్యూహకర్తల ఉద్దేశ్యం  కావచ్చు.) . దాంతో ‘మైనారిటీ’ ద్వేషాన్ని అగ్రవర్ణులతో సమానంగా, బీసీలకు కూడా కలిగించ గలిగారు. ‘అటు బీసీలు’ , ‘ఇటు మైనారిటీలు’.. ఎవరి వోట్లను కోల్పోవటానికి సిధ్ధంగా లేని అక్కడి రాష్ర్టంలో అధికారంలో వున్న ఎస్పీ సర్కారు ఈ చర్యా తీసుకోకుండా వుండిపోయింది. దాంతో మైనారిటీ వ్యతిరేకతతో మెజారిటీనీ కూడగట్టి బీజేపీ యూపీలో అత్యధికంగా ఎంపీ సీట్లను పొందగలిగింది. 

అప్పటి ‘లవ్ స్టోరీ’ అలా వుంటే, ఇప్పటి ‘కవ్ స్టోరీ’ ఇప్పుడు వుంది. ఒక చిన్న పుకారు. దాద్రీ వద్ద బిశారాలో  ఓ కర్రి ఆవు అదృశ్యం అయింది. దానిని అక్కడి ఒక ముస్లిం, ఆయన కుటుంబ సభ్యులూ  హతమార్చి తినేసి, కొంత మాంసాన్ని దాచుకున్నారని,కొందరు దుండగులు అక్కడి గుడి మైకులో చెప్పించారు. ఆ దుండగులే తిరిగి ఊళ్ళో వారిని పురి కొల్పి ఆ ముస్లిం ఇంటి మీద మూకుమ్మడి  దాడి చేసి అతన్ని చంపేసి, అతని కొడుకుని తీవ్రంగా గాయపరిచారు.

 గోవు హిందువులకు పవిత్రం కాబట్టి, గో హత్యకు ఎక్కువ స్పందిస్తారన్న  ఆశతో తిరిగి ‘గోవధ’ ను ఎజెండా మీదకు తెచ్చారు. గోవు అనగానే కులాలకు అతీతంగా బీసీలు సైతం ముస్లింలకు వ్యతిరేకంగా ఏకమవుతారని, అది తరుము కొస్తున్న ఎన్నికలలో లబ్ది చేకూరుతుందని బీజేపీ యోచిస్తే, యోచించ వచ్చు.  అదే సమయంలో, మాంసాహారులు అన్ని అణగారిని కులాలలో ఎక్కువ వుంటారు కాబట్టి  అక్కడ జరిగిన ‘మానవ హత్య’ కు వ్యతిరేకంగా నితిష్‌లాలూలు మెజారిటీనీ కూడబెడదామని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే ఊహించని విధంగా నోయిడాలో ఫిర్యాదు చెయ్యటానికి వెళ్ళిన దళిత దంపతులను దుస్తులు మొత్తం ఊడబెరికి, పోలీసులు కొట్టిన వైనమంటూ, ఒక వీడియోను ‘ఫేస్ బుక్’ లో పెట్టారు. ఆ వీడియో లో ఉన్నదే నిజమయితే, ఈ ఘటనను కూడా పార్టీలు తమ రాజకీయాలకు వాడు కోవన్న గ్యారంటీ లేదు.  విశేషమేమంటే, ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నా, ఉత్తరప్రదేశ్ ఘటనలు కీలకమవుతున్నాయి.  దాద్రీ,నోయిడాలు రెండూ ఉత్తరప్రదేశ్ పరిధిలోకి వచ్చేవే. కానీ అక్కడ మళ్ళీ ఎస్పీ ప్రభుత్వం తన అచేతనత్వాన్ని చాటుకుంటోంది. ఇక్కడ ఆరోపితులు పోలీసులు కాబట్టి మతం రంగు పులమ లేరు. కానీ ఎస్పీ వోటు బ్యాంకుని తమ వైపు తిప్పుకోవటానికి  ఎవరి ప్రయత్నాలు వారు చెయ్యవచ్చు. 

అంతే కానీ, ఇటు హిందూ ముస్లిం అల్లరు జరగకుండా చూడటానికీ, దళితులపై పాశవికమైన దాడులు నివారించటానికి కానీ, రాజకీయ పార్టీలు చిత్త శుధ్ధితో పని చెయ్యటం లేదు.