వరుసగా వాయిదాపడుతూ వస్తున్న 2.0 సినిమాకు బజ్ తగ్గిపోయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మళ్లీ పైకి తీసుకురావాలంటే స్టార్ పవర్ కావాల్సిందే. అందుకే ఈసారి టీజర్ రిలీజ్ ను స్టార్స్ తో నింపేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా చిరంజీవిని రంగంలోకి దించుతున్నారు.
ఫిబ్రవరి మూడో వారంలో 2.0 సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్ లో ఈ కార్యక్రమం నిర్వహించాలని చాలారోజుల కిందటే ఫిక్స్ అయ్యారు. ఈ వేడుకకు చిరంజీవిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. కేవలం చిరంజీవి మాత్రమే కాదు, సౌతిండియాకు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరుకాబోతున్నారు.
నిజానికి 2.0 టీజర్ ఈపాటికి విడుదల కావాలి. కానీ గ్రాఫిక్ వర్క్ లో జాప్యం కారణంగా టీజర్ రిలీజ్ ను వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా డేట్ ఫిక్స్ చేసి, ఆ సమాచారన్ని చిరంజీవికి అందించారు. ప్రస్తుతం ఈ టీజర్ ఎడిటింగ్ వర్క్ లాస్ ఎంజెల్స్ లో జరుగుతోంది.
టీజర్ రిలీజ్ ఫంక్షన్ తో సినిమాపై మళ్లీ అంచనాల్ని పెంచాలని చూస్తోంది యూనిట్. ఆ తర్వాత చెన్నైలో ట్రయిలర్ ను విడుదల చేసి, అదే రోజు విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించాలనేది ప్రస్తుతానికి అనుకుంటున్న ప్లాన్. ఈ షెడ్యూల్ లో ఇంకెన్ని మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.