ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కాదు.. ఫ్యామిలీ డ్రామానే!

మెగాస్టార్‌ చిరంజీవి తన పొలిటికల్‌ ఇమేజికి కూడా మరింత మైలేజీ ఇచ్చేలా చారిత్రాత్మకమైన గోనగన్నారెడ్డి చిత్రం చేయబోతున్నారని ఫిలిం వర్గాల్లో చాలాకాలంగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఎటూ ఒక టర్మ్‌ రాజకీయ జీవితం తర్వాత… తనను…

మెగాస్టార్‌ చిరంజీవి తన పొలిటికల్‌ ఇమేజికి కూడా మరింత మైలేజీ ఇచ్చేలా చారిత్రాత్మకమైన గోనగన్నారెడ్డి చిత్రం చేయబోతున్నారని ఫిలిం వర్గాల్లో చాలాకాలంగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఎటూ ఒక టర్మ్‌ రాజకీయ జీవితం తర్వాత… తనను తాను పునరుత్తేజితుణ్ని చేసుకోవడానికి మెగాస్టార్‌ 150వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందే చారిత్రాత్మక చిత్రం అవుతుందని అందరూ అనుకుంటూ వచ్చారు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌ తమ పవర్‌ఫుల్‌ రచన కూడా పూర్తిచేశారని.. అంతకంటె పవర్‌ఫుల్‌ దర్శకుడికోసం వెతుకుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. 

అయితే చిరంజీవి చేయబోయే 150 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కాదని.. అది ఫక్తు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమేనని ఆయన కుటుంబానికి దగ్గరగా ఉండే ఫిలిం వర్గాల ద్వారా తెలుస్తోంది. చిరంజీవి 150వ చిత్రం కోసం ఆయన అభిమానులు కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ చిరు త్వరలోనే తన 150 సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటిదాకా తెలుగు పరిశ్రమకు సంబంధించి నవతరం అగ్రశ్రేణి దర్శకులు అందరూ కూడా.. చిరు 150 చిత్రానికి దర్శకత్వం వహించడానికి తమ ఆసక్తిని కనబరచి ఉన్నవారే. 

ఇంకా అనేక రకాలుగా చిరంజీవి 150వ చిత్రం అనేది వార్తల్లోకి వస్తూనే ఉంది. చిరంజీవి కథ కోసం ఇంకా వెతుకుతున్నారని.. చాలా మంది చెబుతున్నా.. ఆయనకు పెద్దగా రుచించడం లేదని, ఆయనకు నచ్చే కథ చెప్పే వారికి కోటిరూపాయల రెమ్యునరేషన్‌ కూడా ఇస్తారని రకరకాల వార్తలు వచ్చాయి. మరి కథ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. చిరంజీవి వెతుకుతున్నది మాత్రం ఫక్తు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ స్టోరీకోసమేనట.  ఏది ఏమైనా మెగాస్టార్‌ బర్త్‌డే రోజున ఆ చిత్రాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. రాంచరణ్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. ఆ చిత్రంలో తాను కూడా ఒక ఫుల్‌లెంగ్త్‌ పాత్రనే పోషిస్తారు.