దర్శకుడు వీరభద్రమ్ చౌదరి, హీరో ఆది ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా చుట్టాలబ్బాయి. ఈ సినిమా ఆగస్టు ఫస్ట్ వీక్ లోనే విడుదల కావాల్సింది. కానీ సరైన డేట్ దొరక్క అలా అలా వెనక్కు వెళ్తూ 19న ఫిక్సయింది. విడుదల మరో ఆరు రోజుల్లో వుందనగా ఇప్పుడు నైజాం బయ్యర్ నుంచి షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
థియేటర్లలో చాలా సినిమాలు వుండడం వల్ల, నైజాం ఏరియాకు కమిట్ అయిన బయ్యర్ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. నైజాంలో శ్రీరస్తు శుభమస్తు థియేటర్లో వుంది. దీనికి తోడు బాబు బంగారం ఈ వారమే వచ్చింది. దీనికి దిల్ రాజు బయ్యర్. సో ఆయన థియేటర్లు అన్నీ దానికి వెళ్లిపోయాయి. సురేష్ థియేటర్లు పెళ్లి చూపులతో ఫిక్స్ అయి వున్నాయి. జక్కన్న కూడా అక్కడక్కడ ఇంకా థియేటర్లలో వుండనే వుంది. తిక్క సంగతి సరేసరి.
ఇన్ని సినిమాలు వుండగా ఆటాడుకుందాం రా సినిమా కూడా చుట్టాలబ్బాయితో పాటే విడుదలవుతోంది. ఆటాడుకుందాం రా సినిమాను కొన్న బయ్యరే చుట్టాలబ్బాయి సినిమా కూడా కొనాలనుకున్నారని తెలుస్తోంది. మరి ఆయన అటు ఆ సినిమాకు, ఇటు ఈ సినిమాకు కూడా థియేటర్లు సమకూర్చుకోవడం కష్టం అని భావించి ఆయన వెనకడుకు వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి. చుట్టాలబ్బాయి టీమ్ మరి ఏం చేస్తుందో ఈ లాస్ట్ మినిట్ లో?
వీరభ్రదమ్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది కథానాయకుడిగా నటించారు. ఎన్నారై ప్రొడ్యూసర్లు తొలిసారి నిర్మాణ రంగంలోకి దిగి ఈ సినిమా నిర్మించారు. సుమారు 12 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది.