Advertisement


Home > Movies - Movie Gossip
టీ.ఉద్యమంలో ఇబ్బంది పడిన సినారె!

'మాటకు దండం పెడతా... పాటకు దండం పెడతా' అన్నారు సినారెగా వినుతికెక్కిన డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఓ గజల్‌లో. ఆయనకు మాటంటే ఇష్టం. పాటంటే ఇంకా ఇష్టం. మనిషంటే అవ్యాజమైన ప్రేమ. మట్టి అంటే అంతులేని అనురాగం. ఆయన దృష్టిలో 'విశ్వంభర' ఎవరు? కనబడని భగవంతుడు కాదు. కనబడే మనిషే. ఆయన గొప్ప కవే కాదు. ఆకట్టుకునే వ్యక్తి.

అందుకనే ఆయన మాటకు, పాటకు తెలుగువారందరం దండం పెట్టాల్సిందే. సినారెది విశాల హృదయం. విశ్వమానవ ప్రేమ. గోడలు కట్టుకొని, గిరి గీసుకొని ఉండటం ఇష్టం వుండదు. ప్రాంతాల తేడాలు తెలియవు. భాషల పట్ల పక్షపాతం లేదు. స్వతహాగా సమైక్యవాది అయిన సినారె తెలంగాణ ఉద్యమంలో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారనే చెప్పొచ్చు.

అది ఆయనకు అనివార్యమైన పరిస్థితి. 'నేను సమైక్యవాదిని' అని అనలేని అశక్తత. ఒకప్పుడు 'తెలుగు జాతి మనది...నిండుగ వెలుగు జాతి మనది' అని చెప్పిన ఈ మహాకవి తెలంగాణ ఉద్యమం ఒత్తిడి కారణంగా 'తెలుగు జాతి మనది... రెండుగ వెలుగు జాతి' మనది అన్నారు. అలా అనడం అనివార్యమైంది. తెలంగాణ ఉద్యమం ఒత్తిడి కారణంగా, ఉద్యమ కారుల ఆగ్రహానికి గురి కాకూడదనే ఉద్దేశంతో 'తెలుగుజాతి మనది' పాటకు సంబంధించిన నిజాన్ని కూడా ఆయన ఇంటర్వ్యూల్లో దాచేశారు. 

ఒకసారి 'సాక్షి' టీవీ ఛానెల్‌వారు 'లెజెండ్స్‌' అనే శీర్షికన సినిమా ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశారు. ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టు స్వప్న నిర్వహించింది. ఈ కార్య క్రమంలో భాగంగా డాక్టర్‌ సినారె ఇంటర్వ్యూ వచ్చింది. దాంట్లో తన పాటల ప్రస్థానానికి సంబంధించి అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆ సమయంలో సినారె హిట్‌ గీతం 'తెలుగు జాతి మనది...నిండుగ వెలుగు జాతి మనది' అనే పాటను స్వప్న ప్రస్తావించింది.

ఈ పాట ఎన్టీఆర్‌ సొంత సినిమా 'తల్లా-పెళ్లామా' చిత్రంలోది. 'ఎంతకాలానికి విన్నా ఈ పాట అద్భుతంగా ఉంటుంది' అని స్వప్న ఉత్సాహంగా అన్నప్పుడు సినారె దాన్ని గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే ఇది 'సమైక్యాంధ్ర' ఆవశ్యకతను తెలియచేస్తూ రాసిన పాట. ఆ పాట గురించి, దాని నేపథ్యం గురించి సినారె వివరిస్తే తెలంగాణవాదులు, ఉద్యమకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి రావచ్చు.

ఆ భయం ఆయనకు బాగా ఉంది. అందుకే ఆయన అసలు విషయం చెప్పకుండా 'ఒక సందర్భాన్ని చెప్పి పాట రాయమని అడిగారు. ఇది నేను సందర్భం కోసం రాసిన పాట మాత్రమే. కాని వ్యక్తిగతంగా ఈ పాటలోని అంశంపై నాకు నిబద్ధత లేదు.' అని చెప్పారు. 'తెలుగు జాతి మనది' పాట సూపర్‌ హిట్‌ సాంగ్‌ అయినప్పటికీ తెలంగాణ ఉద్యమం కారణంగా ఆయన దానికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. ఇంటర్వ్యూలో చెప్పినవిధంగా ఆ పాట సందర్భానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు రాసిందికాదు. 

1969-70 ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లోనే సినారెలో సమైక్యాంధ్ర భావనలు ఉన్నాయి. ఆయన సమైక్యాంధ్ర గురించి ఓ పత్రికలో రాసిన కవిత ఇది. ఈ పాట గురించి సినారె తన స్వీయ సినీ గీత చరిత్ర 'పాటలో ఏముంది- నా మాటలో ఏముంది'లో వివరంగా రాశారు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రాంతం విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడటం, తరువాత హైదరాబాదు రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటం... తదితర అంశాలను వివరించిన సినారె భాషా సంస్కృతుల సమైక్య రూపమున్న తెలుగువారి మధ్య రాజకీయ, సాంఘిక, పరిపాలనాపరమైన కొన్ని అసమానతల వల్ల, అపార్ధాల వల్ల ఆంధ్ర-తెలంగాణ అనే ప్రాంతీయ దృక్పథం వేరు దన్నుకొని నిలిచిందన్నారు.

క్రమంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రవాదం ఉద్యమంగా ఉబికి వచ్చిందన్నారు. ఆయన ఇంకా వివరిస్తూ ''ఆ పరిస్థితుల్లో 1970లో నేను రాసిన ఒక పాటను గురించి ప్రత్యేకంగా వివరించాల్సి ఉంది. ఆ సంవత్సరం నేను పాటలు రాసిన చిత్రాల్లో ఎన్‌ఎటీవారి 'తల్లా-పెళ్లామా' పేర్కొనదగింది. త్రివిక్రమరావుగారు నిర్మాతగా, ఎన్‌టీ రామారావు దర్శకులుగా రూపుదిద్దు కుంటున్న ఆ చిత్రంలో అప్పటికే కొన్ని పాటలు రాశాను.

ఒక రోజు మద్రాసులో తల్లా-పెళ్లామా చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా సెట్లోకెళ్లాను. కుశల ప్రశ్నల తరువాత రామారావుగారు హైదరాబాదు పరిస్థితులేమిటి? ప్రత్యేక రాష్ట్రోద్యమం ఎలా సాగుతున్నది? అని అడిగారు. ఉధృతంగా ఉందని బదులిస్తూ ప్రాస్తావికంగా సమైక్యాంధ్రను గురించి నేను రాసి ఒక ప్రముఖ పత్రికలో ప్రచురించిన కవిత చదివి వినిపించాను.

రామారావుగారు ఆ కవితను సంలగ్న దృష్టితో విన్నట్టు కనిపించారు. నాకు తెలుసు ఆయన చూపులు ఎక్కడికో వెళ్లిపోయాయని. కవిత విని పించడం పూర్తి కాగానే 'మీ కవితను పాటగా రాసివ్వండి. ఈ చిత్రంలోనే ప్రవేశపెడతాను' అన్నారు. పాటల రచయితగా ఆ చిత్ర కథ నాకు తెలుసు. ఈ పాటకు తగ్గ సన్నివేశం అందులో లేదు. నా సందేహాన్ని బయటపెట్టాను.

అప్పుడన్నారు రామారావుగారు 'నిజమే! అలాంటి సందర్భం లేదు. కాని మీ కవిత విని ఉత్తేజితుడనై అందుకు అనుగుణంగా ఓ సన్నివేశాన్ని 

కల్పించుకోవాలనుకున్నాను.' అని. అంతే! అలా ఉద్భ వించిన గీతమే 'తెలుగు జాతి మనది/నిండుగ వెలుగు జాతి మనది'. ఈ చిత్రంలో ఎన్‌టిఆర్‌ కళాశాల విద్యార్థి. కళాశాల సాంస్కృతికోత్సంలో వేదిక పైన కథానాయకుడు (ఎన్‌టిఆర్‌) బృంద సమేతంగా పాడే పాటగా దీన్ని చిత్రీకరించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని సమకాలీన సముద్విగ్న రాజకీయ పరిస్థితులతో తప్ప కథతో ఏమాత్రం సంబంధం లేని గీతమిది. సాంస్కృతికంగా, సాంఘికంగా, రాజకీయంగా తెలుగువారి సమైక్యతను వాంఛించే ఆశయ నిబద్ధతతో ఈ గీతానికి ప్రత్యేక సన్నివేశాన్ని సృష్టించుకున్నాడు. ఆ గీతం పల్లవి ఇది:

''తెలుగు జాతి మనది/నిండుగ వెలుగు జాతి మనది/ తెలంగాణ నాది, రాయలసీమ నాది/ సర్కారు నాది, నెల్లూరు నాది / అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా'' 'నాది' అనేది సరికాదు, 'మనది' అనేదే బాగు అన్న అభిప్రాయాన్ని చరణంలో వ్యక్తీకరించాను. ''ప్రాంతాలు వేరైనా-మన అంతరంగమొకటేనన్నా/ యాసలు వేరుగ ఉన్నా - మన బాస తెలుగు బాసన్నా/ వచ్చిండన్నా వచ్చాడన్నా- వరాల తెలుగు ఒకటేనన్నా' ....ఎక్కడున్నా తెలుగువారు తెలుగువారే.

అందరినీ ముడివేసే అనుబంధం మాతృ భాషా బంధం. ప్రాంతానికే కాదు, జిల్లా జిల్లాకు కూడా యాస మారుతుంటుంది. ఉప నదులెన్నో కలిస్తే ఒక మహా నది. యాసలెన్నో ఉం టేనే ఒక సమగ్ర భాష. తెలంగాణలో 'వచ్చిండు' అన్నా, ఆంధ్ర ప్రాంతంలో 'వచ్చాడు' అన్నా రెండూ యాసలే. ఏదీ గ్రాంథికం కాదు.

'మహా భారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో/ భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో/ ఈ రెంటిలోన ఏది కాదన్న/ ఇన్నాళ్ల సంస్కృతి నిండు సున్నా'...

.నాటి వేర్పాటు ఉద్యమంలో 'ఆంధ్రోల్లు వేరు... తెలంగానోల్లం వేరు' కొందరు వాదిస్తుంటే విని, నా కళ్ల ముందు హైదరాబాదు నగరంలోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఏకకాలంలో ప్రత్యక్షమయ్యేవి.

ఆంధ్ర ప్రాంతంలో రాజమహేంద్రవరంలో పుట్టిన నన్నయ భారతం పేరు 'ఆంధ్ర మహా భారతం'. వరంగల్లులో ఉదయించిన పోతన్న భాగవతం పేరు 'శ్రీమదాంధ్ర మహా భాగవతం'. తెలంగాణలో ఆంధ్ర శబ్దాన్ని బహిష్కరించాలనుకుంటే ఆంధ్ర మహా భాగవతం పేరు కూడా మార్చాలా? ఆ ప్రశ్నకు సమాధానం పై చరణంలో ఉంది. ఆ గ్రంథ రత్నాలు రెండూ విభిన్న ప్రాంతాల్లోనివైనా అవి తెలుగువారి సంస్కృతికి కట్టిన అక్షర దీప స్తంభాలు.

మూడో చరణంలో ఇటు పోచంపాడు, అటు నాగార్జున సాగరం జలాశయాలు అయిదు కోట్ల (ఈ పాట రాసి నప్పటికి రాష్ట్ర జనాభా) తెలుగువారివని ఉగ్గడించాను. నాలుగో చరణంలో సిపాయి కలహం మొదలుకొని స్వరాజ్య సిద్ధి వరకు తెలుగు వారు ఏ రకంగా నిరస నోద్యమాల్లో పాల్గొన్నారో వివరించాను. ఈ గీతంలోని చివరి చరణం ప్రత్యేకంగా గమనించదగింది. ఇందులో నేను సమకాలీన వాస్తవికతను ఎత్తి చూపాను.

అభిప్రాయ భేదాలున్నాయి, అసమానతలున్నాయి, అన్యాయాలు జరిగాయి. కాదనలేం. అంతమాత్రానమూల రాష్ట్రానికే ముప్పు ఏర్పడటం వాంఛనీయం కాదు.

అప్పటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని విజ్ఞప్తిరూపకంగా ఆ చివరి చరణంలో ఇలా నివేదించాను....''ఇంటిలోన అరమ రికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా?/కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికివేయాలా?/పాలుపొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు/నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయోద్దు''....... ఇదీ డాక్టర్‌ సినారె తన తెలుగుజాతి మనది పాట గురించిన నేపథ్యం తన పుస్తకంలో వివరించిన తీరు. రాష్ట్ర విభజన తరువాత ఈ పాట తెరమరుగైంది.

-ఎం.నాగేందర్‌