కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ' ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మండన్నకి రాత్రికి రాత్రి పాపులారిటీ తెచ్చేసింది. ప్రస్తుతం తెలుగులో ఈమె గురించి వస్తున్న గాసిప్స్ అన్నీ ఇన్నీ కావు.
ఏకంగా ప్రభాస్ సరసన 'సాహో' సినిమాలో ఛాన్స్ కొట్టేసిందన్నారు. జూనియర్ ఎన్టీఆర్, రష్మిక కోసం ట్రై చేస్తున్నాడన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త సినిమా 'నా పేరు సూర్య'లో ఆమే హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది.
కానీ, ఇంతవరకూ తెలుగులో సినిమా చేసే విషయమై రష్మిక ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. ఇటీవలే రష్మికకి ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. పెళ్ళి పీటలెక్కే జోష్‌లో వున్న రష్మిక, అసలంటూ మళ్ళీ సినిమాల్లో నటిస్తుందో లేదో ఎవరికీ తెలియని పరిస్థితి.
కానీ, ఆమె చుట్టూ గాసిప్స్ మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తూనే వున్నాయి. దీపం వున్నప్పుడే చక్కబెట్టుకోవాలి.. అవకాశాలున్నప్పుడే సొంతం చేసుకోవాలి. ఇది సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట.
కానీ రష్మికకి సినిమాల్లో నటించే విషయమై అంత తొందర వున్నట్లు కన్పించడంలేదు. 'నటన నాకిష్టం.. అలాగని అదే పూర్తి వ్యాపకం కాదు. ఎక్కువ సినిమాల్లో నటించేయాలన్న తొందర అసలే లేదు..' అని ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో రష్మిక చెప్పుకొచ్చింది.
కన్నడ తర్వాత సౌత్‌లో ఏ లాంగ్వేజ్‌కి ప్రిఫరెన్స్.? అని ప్రశ్నించినప్పుడూ. ప్రస్తుతానికి కన్నడ సినిమాలు తప్ప, ఇంకో భాషలో సినిమాలు చేసే ఛాన్స్ లేదని తేల్చి చెప్పేసింది. ఇది ఆమె ఎంగేజ్‌మెంట్‌కి ముందు చెప్పిన మాట. అప్పుడే అంత క్లారిటీ వుందంటే, ఎంగేజ్‌మెంట్ తర్వాత ఇంకెంత క్లారిటీతో వుండి వుండాలి.?