సినిమా సినిమానే..బాకీ బాకీనే

బిడ్డ చచ్చిపోయినా, పురిటికంపు పోదు అని సామెత. సినిమా ఫ్లాప్ అయిపోయినా, బాకీల బాధ, ఇతరత్రా వ్యవహారాలు తప్పవు. అవి  వెన్నాడుతూనే వుంటాయి. హిట్ అన్నది చూసి చాలాకాలం అయిపోయిన ఓ యంగ్ హీరోతో…

బిడ్డ చచ్చిపోయినా, పురిటికంపు పోదు అని సామెత. సినిమా ఫ్లాప్ అయిపోయినా, బాకీల బాధ, ఇతరత్రా వ్యవహారాలు తప్పవు. అవి  వెన్నాడుతూనే వుంటాయి. హిట్ అన్నది చూసి చాలాకాలం అయిపోయిన ఓ యంగ్ హీరోతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మించారో కొత్త నిర్మాత. పైగా సూపర్ హీరోయిన్ కు కూడా సెట్ చేసారు ఈ సినిమాకు. సినిమా కోసం ఓ వాస్తవమైన సెట్ కూడా వేసారు. నాలుగు కోట్లకు పైగా ఖర్చు చేసారు. 

ఈ సినిమా ప్రాజెక్టులో పది లక్షలు ఫైనాన్స్ గా, నలభై లక్షలు పార్టనర్ షిప్ గా చేరారట ఈస్ట్ గోదావరికి చెందిన ఓ వ్యక్తి. తీరా సినిమా ఫ్లాప్ కాగానే, పార్టనర్ షిప్ తో తనకు సంబంధం లేదని, తన యాభై తనకు ఇవ్వాల్సిందే అని వత్తిడి చేస్తున్నారట. దీంతో ఇరవై లక్షల ఇచ్చి, మిగిలినది తరువాత ఇస్తా అని నిర్మాత మొరపెట్టుకున్నా వినడం లేదట. 

పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చినా ఓకె అనడం లేదట. తనకున్న పలుకుబడితో నిర్మాత సన్నిహితులపై వత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  తన దగ్గర పార్టనర్ షిప్ డీడ్ వుందని, అయినా దాన్ని కాదని, తాను ఇచ్చింది ఫైనాన్సే అని, మొత్తం వెనక్కు ఇవ్వాల్సిందే అని సదరు వ్యక్తి వత్తిడి చేస్తున్నట్లు నిర్మాత వాపోతున్నారట. టాలీవుడ్ లో అంతే. దిగిన తరువాత , చేతులు కాలాయని వగచి లాభం లేదు. బాధ భరించాల్సిందే.