'ఎవరి ప్రైవేటు జీవితాలు వారిష్టం.. పబ్లిక్‌లోకి వస్తే ఏమైనా అంటాం..' అంటాడు మహాకవి శ్రీశ్రీ. రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాల్సిందే. హుందాగా వ్యవహరించకపోయినాసరే, 'నవ రంధ్రాలూ మూసుకుని వుండాలి..' అంటాడు ఇంకో మహానుభావుడు. ఇదంతా రాజకీయ నాయకుల్ని కించపర్చడానికి కాదు.. నాయకుడన్నాక ఏ పరిస్థితుల్ని అయినా తట్టుకుని నిలబడాలనీ, బావోద్వేగాలకు లోనుకాకూడదనీ చెప్పడానికి మాత్రమే. ప్రజలకు జవాబుదారీగా వుంటేనే ఎవరైనా నాయకుడయ్యేది.
కానీ, ఇప్పుడున్న రాజకీయాలు అలా లేవు కదా.! అక్కడే వస్తోంది చిక్కు అంతా. ఎవరన్నా విమర్శిస్తే చాలు, కోర్టులున్నాయి కదా.. అంటూ ఠకీమని కోర్టులో ఓ 'పరువు నష్టం దావా' వేసి పారేస్తున్నారు. అంతే, ఆ తర్వాత కేసు నలిగీ నలిగీ.. విసిగివేసారిపోతుంది. కొన్ని కేసుల్లో ఆరోపణలు చేసినవారికి ఇబ్బందులు తప్పవనుకోండి.. అది వేరే విషయం. మరికొన్ని కేసుల్లో ఆరోపణలు చేసినవారికి విపరీతమైన పబ్లిసిటీ వచ్చిపడ్తుంది. అంతిమంగా, న్యాయస్థానాల విలువైన సమయం వృధా అవుతుంది. ఇది నిజం.
మొన్నొక పెద్దాయన, 'న్యాయవ్యవస్థలో సమస్యల్ని పాలకులు పట్టించుకోవడంలేదు..' అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ధర్మం చెప్పే పెద్దాయనగా పనిచేస్తున్నా, ఆయన కంట కన్నీరు జలజలా రాలిపోయింది. వందలు, వేలు కాదు, లక్షల్లో కోట్లల్లో కేసులు పెండింగ్‌లో వుండిపోతున్నాయన్నది ఆయనగారి ఆవేదన. ఎందుకుండవు.? తుమ్మితే వివాదం, దగ్గితే వివాదం.. ఏ వివాదానికైనాసరే, అప్పనంగా న్యాయస్థానాలొకటి దొరుకుతున్నాయి అందరికీ.
తాజాగా, సర్వోన్నత న్యాయస్థానం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి, పరువునష్టం దావా కేసులో చీవాట్లు పెట్టింది. చిన్న చిన్న వివాదాలకు న్యాయస్థానాల్ని ఆశ్రయించడం ఏమంత బాగాలేదనీ, ప్రజాక్షేత్రంలో వున్నాక విమర్శల్ని ఎదుర్కోవడమో, వాటికి ధీటుగా సమాధానం చెప్పడమో చెయ్యాలిగానీ, ప్రతి విమర్శకు కేసు వేయడం సబబు కాదని సర్వోన్నత న్యాయస్థానం హితవు పలికింది. మామూలుగా అయితే, ఇదేదో చిన్న కామెంట్.. అన్నట్లుందిగానీ, వ్యవహారం చాలా సీరియస్సే.
రాజకీయాల్లో అవినీతి సర్వసాధారణం. ఆ అవినీతిపై ఆరోపణలు అంతకన్నా సాధారణం. అవినీతి ఆరోపణలు రాగానే, ముందుగా విన్పించే మాట పరువు నష్టం దావా. అలా దావా వేస్తున్నవారిలోనూ అవినీతిపరులుంటున్నారు. అక్కడే మరి, న్యాయస్థానాలకైనా ఒళ్ళు మండేది. ఓ కేసులో నిందితుడి కారణంగా ప్రాణం పోయిందన్న విషయం న్యాయస్థానానికి తెలిసినా, సాక్ష్యాలు లేక కేసు కొట్టేయాల్సిన పరిస్థితి. వ్యవస్థ ఇలా వున్నప్పుడు, న్యాయస్థానాలనుంచి ఇలాంటి మాటలే వస్తాయ్ మరి.
కేసులేస్తారు, రాజీకొస్తారు.. ఇక, ఇలాగైతే న్యాయస్థానాలెందుకు.? పైగా, తిట్టిన నోటితోనే పొగుడుతారు. ఈ రాజకీయాల్ని చూసి కళ్ళు లేని న్యాయదేవత సైతం కన్నెర్రజేసే పరిస్థితి రాకుండా వుంటుందా.! ఇకపై ఎవరైనాసరే పరువు నష్టం దావా వేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. అధికారం వుంది కదా.. అని పరువు నష్టం దావా వేసుకుంటూ పోతే, న్యాయస్థానాలకు ఇంకేమీ పని వుండదు.. ఈ కేసుల్ని డీల్ చేసుకుంటూ పోవాల్సిందే.
అయినా, మాటంటే పడేది లేదని కోర్టుకెళ్ళేవారు అసలు నాయకులేనా.? అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత లేదా.? 'నాపై ఆరోపణలు తప్పు' అని గుండె మీద చెయ్యేసుకుని చెప్పే ధైర్యం లేని సన్నాసులే, నేటి రాజకీయాల్లో నాయకులుగా చెలామణీ అయిపోతుండడం అత్యంత దురదృష్టకరం.