అఖిల్ రెండో సినిమా సస్సెన్స్ తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా సాగుతోంది. వచ్చిన వాళ్లని వదిలేస్తూ, మళ్లీ ఎవరు వస్తారా అని చూస్తూ, ఇలా కాలక్షేపం చేసుకుంటూ, రోజులు దొర్లించేస్తున్నాడు మహేష్ తరువాత అంతటి సూపర్ స్టార్ అయిపోతాడని చాలా మంది గాల్లోకి ఎత్తేసిన అక్కినేని అఖిల్. పైగా అఖిల్ కు కాస్త ఆటిట్యూడ్ వుందని నిజమో, కాదో తెలియని వైనం ఒకటి టాలీవుడ్ లో బాగా పాకిపోయింది.
ఇవన్నీ కలిసి అఖిల్ ను రెండో సినిమాపై ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా చేస్తున్నాయి. విక్రమ్ కుమార్ తో చేద్దాం అనుకుంటే ఆయన తను బన్నీతో చేసిన తరువాత చేస్తా అని అంటున్నాడని వినికిడి. అందుబాటులో మరే డైరక్టర్ లేరు. ప్రస్తతానికి అయితే మారుతి ఒక్కరే రెడీగా వున్నారు. కాస్త లేట్ చేస్తే, ఆయనా ఏదో ప్రాజెక్టులో ఫిక్స్ అయిపోతారు.
అందుకే మారుతినే మంచి లవ్ అండ్ యూత్ ఫుల్ సబ్జెక్ట్ ను తన కోసం తయారుచేయమని అఖిల్ కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మారుతి ఇదే పనిపై గడచిన వారం రోజులుగా బిజీగా వుంటున్నట్లు వినికిడి. ఎలాగైనా ఓ వారంలోపు మారుతి ఓ మాంచి క్రేజీ సబ్జెక్ట్ ను అఖిల్ కు వినిపించే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది.
ఓ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ను అఖిల్ కోసం మారుతి తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. అదే కనుక ఫైనల్ అయితే సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మారుతి-అఖిల్ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పటికే అన్న నాగ్ చైతన్యతో సినిమా చేసిన ఈ సంస్థ తమ్ముడితో కూడా మరో సినిమా చేసినట్లు అవుతుంది.