పరాజయాలు పలకరిస్తుంటే సత్తా మీద కన్నా సెంటిమెంట్ మీదకు మనసుపోతుంటుంది. మెగా బ్యాచ్ హీరోల్లో ఒకరైన సాయి ధరమ్ తేజ వరుసపెట్టి ఫ్లాపులు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఇంక ఒక్క సినిమా వుంది చేతిలో. సీనియర్ మాస్ డైరక్టర్ వివి వినాయక్ సినిమా అది. ఈ సినిమా మీద ఆశలు బాగానే వున్నాయి. అయితే కేవలం సినిమాను నమ్ముకోవడంతో పాటు, సెంటిమెంట్ ను కూడా నమ్ముకుంటున్నాడట సాయిధరమ్.
గతంలో కెరీర్ ప్రారంభించినపుడు మెగా మావయ్యల యాక్టింగ్ మేనరిజమ్స్ వాడేయడంతో పాటు, వాళ్ల పాటలు రీమిక్స్ చేయడం అలవాటు చేసుకున్నాడు. ఒకటి రెండు పాటలు అలాచేసి ఆపేసాడు. తన హిట్ పాటలు అన్నీ అలా చేస్తుంటే, చిరంజీవి కాస్త బ్రేక్ వేసారని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి.
అయితే ఆ తరువాత మూడు సినిమాల బట్టీ రీమిక్స్ లు లేవు. అవన్నీ ఫ్లాపులే. అందుకే మళ్లీ రీమిక్స్ చేస్తే హిట్ పలకరిస్తుందని అనుకుంటున్నట్లుంది. కొండవీటి దొంగలోని చమకు చమకు చమ్ పాటను వివి వినాయక్ సినిమాలో రీమిక్స్ చేసే ఆలోచనలో వున్నాడట.
ధర్మా భాయ్ లేదా ఇంటిలిజెంట్ అనే టైటిళ్లు ఆలోచిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకు రెడీ అవుతోంది.