కమెడియన్ సునీల్ హీరో సునీల్ అయిపోయాడు. ఆ ముచ్చట తీరింది. హీరోగా సినిమాల విషయంలో కిందామీదా అవుతున్నాడు. తత్వం బోధపడింది. జనం గుండెల్లో తను ఇంకా కమెడియన్ గా పదిలంగానే వున్నాడని అర్థం అయింది. అందుకే మళ్లీ ఆ దిశగా వెళ్లాలని డిసైడ్ అయిపోయాడు. 2018లో సునీల్ హీరోగా సినిమాలు వుండొచ్చు. వుండకపోవచ్చు. కానీ కీలకమైన కమెడియన్ పాత్రల్లో మాత్రం కచ్చితంగా కనిపిస్తానని నమ్ముతున్నాడు.
ముఖ్యంగా మూడు సినిమాల మీద ఆశలు పెట్టుకున్నాడు. అవి ఒకె అయితే సునీల్ కెరీర్ మళ్లీ టర్నింగ్ ఇచ్చుకున్నట్లే. వాటిలో ఒకటి తన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లోని సినిమా. ఈ సినిమా ఓ ఫుల్ లెంగ్త్ హీరో మిత్రడు కమ్ కమెడియన్ క్యారెక్టర్ వుంది. త్రివిక్రమ్ ఆ పాత్రను తనకు ఇస్తాడని, దాంతో మళ్లీ కమడియన్ గా చెలరేగుతానని నమ్మకంతో వున్నాడు సునీల్.
రెండవది శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా. ఇందులో శ్రీను వైట్ల మళ్లీ ఓ అధ్భుతమైన ఎంటర్ టైన్మెంట్ పాత్రను సునీల్ కోసం తయారుచేసాడు. అది ఓకె అయి, సెట్ మీదకు వెళ్తే, అంతా సెట్ అయిపోతుందన్న ఆశ వుంది.
ముచ్చటగా మూడోది మెగాస్టార్ సైరా సినిమా. మెగాస్టార్ 150వ సినిమాలో నటించే అవకాశం దురదృష్టం కొద్దీ తప్పిపోయింది. ఎలాగైనా సైరాలో తాను వుండాలని అనుకుంటున్నాడు సునీల్. అడగందే అమ్మయినా పెట్టదు కనుక, మెగాస్టార్ నే అడిగేసాడు. ఆయన అభయం ఇచ్చాడు. ఆ అభయం కార్యరూపం దాల్చితే సునీల్ పంట పండినట్లే.
ఈ మూడు సినిమాలు కనుక సునీల్ కు చిక్కితే అతగాడి కెరీర్ ఫుల్ గా టర్నింగిచ్చేసుకుని, టాప్ గేర్ లోకి వెళ్లిపోతుంది.