సినిమా ‘కాపు’ కాయలేదేం?

పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమా ఫంక్షన్ కు వచ్చి కాస్త అధిక ప్రసంగం చేసారు. దాంతో అది కాస్తా బెడిసికొట్టి కౌంటర్ అటాక్ లు ఓ రేంజ్ లో…

పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమా ఫంక్షన్ కు వచ్చి కాస్త అధిక ప్రసంగం చేసారు. దాంతో అది కాస్తా బెడిసికొట్టి కౌంటర్ అటాక్ లు ఓ రేంజ్ లో ప్రారంభం అయ్యాయి. 

రాజకీయ నాయకులు వాళ్ల స్టయిల్ లో వాళ్లు కౌంటర్లు ఇచ్చారు. పవన్ కు మద్దతుగా హీరోలు నాని, కార్తికేయ ట్వీట్ లు వేసారు. చిన్న, చితక జనాలు మెగా జపం చేసి పని కానిచ్చుకుంటూ టాలీవుడ్ లో బతికేసే సాదా సీదా ట్విట్టర్ హ్యాండిల్స్ కొన్ని అహో..పవన్ స్పీచ్ అద్భుతం అన్నాయి. 

కానీ ఇక్కడ గమ్మత్తేమిటంటే పవన్ కు మద్దతుగా మరే మెగా హీరో నోరు మెదపకపోవడం. ఊటీలో షూట్ లో వున్న మెగాస్టార్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారని వార్తలు వచ్చాయి. 

తమ్ముడు పవన్ అంటే చాలు, సర్రున దూసుకుని వచ్చి అడ్డంగా నిలబడిపోయే నాగబాబు ఎక్కడున్నారో తెలియదు. ఆయన తనయుడు కానీ, పవన్ తో ఫంక్షన్ కు వచ్చిన వైష్ణవ్ కానీ, ఇంకా చాలా మంది మెగా ట్యాగ్ లైన్ పెట్టుకున్నవారు కానీ నోరు మెదపలేదు. అస్సలు ఓ ట్వీటు కూడా వేయలేదు.

అంతెందుకు ఈశ్వరా..పవనేశ్వరా..పవరేశ్వరా అంటూ కొత్త పదాలు కాయిన్ చేసి, ట్విట్టర్ లో తెల్లవారింది మొదలు పవన్ భజన చేసే రామ భక్త హనుమాన్ లాంటి బండ్ల గణేష్ కూడా కిమ్మనలేదు. బాబూ బండ్లా..నోరు తెరు నాయనా అని ట్విట్టర్ లో చాలా మంది అపీల్ చేసినా మాట్లాడలేదు. 

ఇండస్ట్రీలో మెగా భజన చేసే భక్త జనాలు ఇంకా చాలా మందే వున్నారు. వారెవ్వరూ కూడా పవన్ కు మద్దతుగా నోరు మెదపలేదు. 

అంతెందుకు రిపబ్లిక్ ఫంక్షన్ లో పవన్ స్పీచ్ సాగుతున్నంత సేపూ సీట్లోంచి కదిలిపోయి, వళ్లంతా నోరే అన్నంతగా నవ్వులు రువ్విన దర్శకుడు హరీష్ శంకర్ కానీ, నిర్మాత దిల్ రాజు కానీ, ఇంకా అక్కడున్న సో మెనీ పీపుల్ కానీ, పవన్ స్పీచ్ అమోఘం, అద్భుతం అని ఆయనను డిఫెండ్ చేస్తూ కనీసం ట్వీటు కూడా వేయలేదు. అంటే వీరెవ్వరికీ పవన్ స్పీచ్ నచ్చలేదా?  

పవన్ సన్నాసి అని సంబోంధించిన మంత్రి పేర్ని నాని హైదరాబాద్ వచ్చినపుడల్లా సాయంత్రాలు కాస్త సరదాగా ముచ్చటించేది సినిమా జనాలతోనే. వారిలో ముఖ్యులు పవన్ తో సినిమా తీస్తున్న మైత్రీ మూవీస్ అధినేతలే. 

సినిమా జనాలంతా పేర్ని నానిని సత్కరించారు. సన్మానించారు. అందులో మెగాస్టార్ కూడా వున్నారు. మరి వీళ్లందరికీ మంత్రి అచ్చంగా మంత్రిలా కనిపిస్తే పవన్ కు మాత్రం సన్నాసి అయిపోయారు. ఇక్కడ దృష్టిలోపం ఎవరిదో?

చిరంజీవి మీద మాటలు విసిరారు. బాలయ్య ను అన్యాపదేశంగా టార్గెట్ చేసారు. మంచు ఫ్యామిలీ మీద మాటలు విసిరారు. మరే కుటుంబాన్ని వదిలారు ఇండస్ట్రీలో? ఇంక ఎవరు మద్దతు పలుకుతారు పవన్ కు?  నోరా వీపుకు తేకే అన్నట్లు అయింది పవన్ పరిస్థితి.