జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ స్పందనపై పోసాని అటాక్ చేశారు. పవన్ కల్యాణ్ ఏ మాత్రం విలువల్లేని వ్యక్తి అని, ఆయనకో వ్యక్తిత్వం లేదని, తన గురించి ఏదో ఊహించుకుంటూ పవన్ కల్యాణ్ స్పందిస్తున్నారని పోసాని రెచ్చిపోయారు.
పవన్ కల్యాణ్ కు ఉన్న వ్యక్తిత్వం ఏమిటి? ఆయన ఉద్ధరించి ఎవరిని? అన్నట్టుగా ప్రశ్నించిన పోసాని, తనకు టాలీవుడ్ లో అవకాశాలు రాకపోయినా ఫర్వాలేదని.. తను మాట్లాడకుండా ఆగేది లేదన్నట్టుగా స్పందించారు.
అసలు పవన్ కల్యాణ్ కు హితబోధ చేయడం కూడా వ్యర్థం అని, ఆయన మారడని, జగన్ పై అకారణమైన అక్కసు తప్ప పవన్ కల్యాణ్ కు ఒక విధానం ఏమీ లేదన్నట్టుగా పోసాని వ్యాఖ్యానించారు. ఒక సినిమా ఫంక్షన్ కు వెళ్లి రాజకీయం మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు అన్నీ అయిపోయి ఇప్పుడు కులం మీద పడ్డారన్నారు.
మతం అయిపోయి.. ఇప్పుడు జగన్ కులం మీద మాట్లాడుతున్నారు. పేరులో రెడ్డి అని పెట్టుకోని దిల్ రాజుకు కూడా కుల పైత్యం అంటగట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. దిల్ రాజు అన్ని కులాల వారికీ అవకాశాలు ఇచ్చారని, ఆయనేమీ రెడ్లకే అవకాశాలు ఇవ్వలేదన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుల పిచ్చి ఉందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యానంపై పోసాని తీవ్రంగా స్పందించారు. జగన్ పార్టీలో అన్ని కులాల వారూ లేరా? అని ప్రశ్నించారు. జగన్ పార్టీలో కమ్మ వాళ్లున్నారు, కాపులున్నారు.. అన్ని కులాల వారూ ఉన్నారు, జగన్ కు కుల పిచ్చి ఉందా? అని పులివెందులకు వెళ్లి అడగలాన్నారు.
జగన్ ఇంటికి చిరంజీవి వెళితే.. సవ్యంగా స్వాగతం పలికారని, వెళ్లగానే శాలువా వేసి సన్మానించారని, భోజనం పెట్టి, చక్కగా మాట్లాడి, సాగనంపారని.. పోసాని గుర్తు చేశారు. మరి చిరంజీవి రెడ్డా? అని ప్రశ్నించారు. చిరంజీవి కాపు కాదా? అన్నారు.
అసలు టికెట్ రేట్ల విషయంలో జోక్యం చేసుకోవడానికి హీరోలకు ఏం సంబంధం? అని పోసాని ప్రశ్నించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వాళ్లు ఎవ్వరూ సినిమా టికెట్ రేటు ఎంత ఉండాలో.. ప్రభుత్వాలను కోరలేదన్నారు. వారు రియల్ హీరోలని, సినిమాల్లోనూ హీరోలని.. వారితో పోలిస్తే.. నువ్వు, నేను ఎంత గొప్ప నటులం? అని పోసాని ఎద్దేవా చేశారు. అన్నీ రేట్లూ పెరుగుతున్నాయి కాబట్టి.. సినిమా టికెట్ రేట్లు కూడా పెరగాలని అనేట్టుగా అయితే, సూటిగా ఆ మాట మాట్లాడాలన్నారు.
రాజకీయాల్లో ఫెయిల్ అయ్యి వెనుదిరిగినా చిరంజీవి ఏ రోజూ అనుచితంగా మాట్లాడలేదని, సభ్యతలేని మాటలు మాట్లాడలేదని.. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఇలా దిగజారిపోయారని పోసాని అన్నారు. చంద్రబాబు ఏం చేసినా పవన్ కల్యాణ్ కు మంచోడని, జగన్ ఏం చేసినా ఈయనకు చెడ్డోడే అని ఈ విషయంలో పవన్ తీరులో ఎలాంటి మార్పూ ఉండబోదని పోసాని అభిప్రాయపడ్డారు. అలాంటి పవన్ కు చెప్పి కూడా వ్యర్థం అన్నారు.
గతంలో పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్ మెంట్లు, అందుకు విరుద్ధంగా ఆ తర్వాత ఇచ్చిన స్టేట్ మెంట్లు.. రెంటినీ పోల్చి ఆయన వ్యక్తిత్వంపై ఒక అంచనాకు రావాలని ఆ వీడియోలను ప్రదర్శించారు పోసాని. పవన్ కల్యాణ్.. వ్యక్తిత్వం.. ఉన్నతం.. అనే ఊహాజనిత, ఆధారాలు లేని ప్రచారాన్ని పోసాని ఇలా ఎండగట్టారు.
పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం ఏ రకంగా గొప్పదో చెప్పాలన్నారు. మొత్తానికి పవన్ ప్రచారం చేయించుకునే.. వ్యక్తిత్వం, నిజాయితీ.. వంటి అంశాలనే పోసాని డైరెక్టుగా టార్గెట్ చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మద్దతుగా సినిమా నుంచి ఎవరూ స్పందించకపోగా.. ఇలాంటి కౌంటర్లు కూడా తప్పేలా లేవు జనసేనానికి!