మరోసారి తెరపైకి స్పైడర్.. అభిమానుల తిట్ల వర్షం

హిట్ సినిమాల్ని ట్రెండ్ చేయడం ఫ్యాన్స్ కు భలే సరదా. ఫలానా సినిమా ఐదేళ్లు లేదా పదేళ్లు అయిందంటూ తమ హీరోలు చేసిన హిట్ సినిమాల్ని ట్రెండ్ చేస్తుంటారు. కానీ ఆశ్చర్యకరంగా మహేష్ ఫ్యాన్స్…

హిట్ సినిమాల్ని ట్రెండ్ చేయడం ఫ్యాన్స్ కు భలే సరదా. ఫలానా సినిమా ఐదేళ్లు లేదా పదేళ్లు అయిందంటూ తమ హీరోలు చేసిన హిట్ సినిమాల్ని ట్రెండ్ చేస్తుంటారు. కానీ ఆశ్చర్యకరంగా మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఓ ఫ్లాప్ సినిమాను భుజానికెత్తుకున్నారు. ఓవైపు ట్రెండ్ చేస్తూనే, మరోవైపు తిట్ల దండకం అందుకున్నారు.

మహేష్ ఫ్యాన్స్ ఈరోజు ట్రెండ్ చేస్తున్న ఆ సినిమా పేరు స్పైడర్. ఈ సినిమా రిలీజై ఇవాళ్టికి సరిగ్గా నాలుగేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా 4ఇయర్స్ ఆఫ్ స్పైడర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూనే.. తమ నిరసనను కూడా తెలియజేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

సినిమాకు వచ్చిన హైప్ కు సరైన కంటెంట్ పడినట్టయితే మహేష్ కెరీర్ లోనే మరో పోకిరి అయ్యేదని, కానీ మురుగదాస్ మాత్రం చెత్త కథ, అతిచెత్త స్క్రీన్ ప్లేతో ఫ్లాప్ ఇచ్చాడని ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు మహేష్ కు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్లు కూడా ఎక్కువయ్యారు. ఇకనైనా డైరక్టర్ క్రేజ్ ను కాకుండా,కథను చూసి సినిమాలు ఓకే చేయమని చెబుతున్నారు.

మరికొందరైతే సినిమాలో ఓ ఫన్నీ సాంగ్ ను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అదే పుచ్చకాయ సాంగ్. ఈ పాట ఎంత వెరైటీగా ఉంటుందో, అందులో మహేష్ బాబు డ్రెస్సులు కూడా అంతే వింతగా ఉంటాయి. దయచేసి ఇలాంటివి కూడా ఆపేయమంటూ మరికొందరు ఫ్యాన్స్ (మరీ ముఖ్యంగా మహిళా ఫ్యాన్స్) సోషల్ మీడియాలో మహేష్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఓవైపు ఇలా ట్రోల్స్ నడుస్తున్నప్పటికీ.. మహేష్ మాత్రం తన కెరీర్ లో మురుగదాస్ కు ప్రత్యేక స్థానం ఇస్తాడు. సినిమా ఫెయిల్ అయినప్పటికీ సిన్సియర్ గా ఓ ప్రయత్నం చేశామని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అటు తమిళనాట మాత్రం ఈ సినిమాను ట్యాగ్ చేస్తూ, ఎస్ జే సూర్యను చాలామంది తమిళ జనాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎందుకంటే, ఇందులో విలన్ గా నటించింది అతడే. తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నాడు ఎస్ జే సూర్య.