ఒకవైపు కాంగ్రెస్ నుంచి వచ్చే వారికి పెద్ద పెద్ద పీటలనే వేస్తోంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ వ్యతిరేకతనే పునాదిగా చేసుకుని బలోపేతం అయిన ఉత్తరాది రాష్ట్రాల్లోనే.. అదే కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి బీజేపీ గొప్ప ప్రాధాన్యతను ఇస్తోంది!
మన్మోహన్ కేబినెట్లో, రాహుల్ కు సన్నిహితులుగా పేరు పొందిన వారికి ఈ రోజు బీజేపీ తరఫున సులభంగా కేంద్ర మంత్రి పదవులు దక్కుతున్నాయి! ఇంకా.. ఇంకా.. ఎవరొచ్చినా చేర్చుకోవడానికి రెడీ, కాంగ్రెస్ నుంచి వస్తే బీ రెడీ అన్నట్టుగా కమలం పార్టీ సంకేతాలను ఇస్తోంది. కాంగ్రెస్ ను బూచిగా చూపించి, కాంగ్రెస్ నుంచి వచ్చే వారికి మాత్రం హారతులు ఇవ్వడం ఏమిటో కమలం భక్తులకే తెలియాలి!
ఇలా బీజేపీ బారి నుంచినే కాంగ్రెస్ ఒకవైపు ఖాళీ అయిపోతూ ఉంటే, మరో వైపు విపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ ను టార్గెట్ గా చేసుకున్నట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి అవి తాపత్రయపడుతున్నాయి. ఇలా ముందు వరసలో ఉంది టీఎంసీ. తాజాగా గోవా మాజీ సీఎం ఫలెయిరో ను టీఎంసీలోకి చేర్చుకున్నారు. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసిన ఆయన టీఎంసీలో చేరారు. దీంతో గోవాలో కాంగ్రెస్ బలం నాలుగు సీట్లకు పడిపోయింది.
వాస్తవానికి ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలు కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లను ఇచ్చారు. 40 సీట్లున్న అసెంబ్లీలో అప్పుడు కాంగ్రెస్ కు 17, బీజేపీకి 13 సీట్లు దక్కాయి. అయితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది! ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలమేస్తూ వస్తోంది. మొదట ముగ్గురిని లాగింది. ఆ తర్వాత ఒక సీటుకు ఉప ఎన్నిక వస్తే దాన్ని కూడా బీజేపీ గెలవలేకపోయింది. కాంగ్రెస్ గెలుపుతో ఆ పార్టీ బలం 15 మంది ఎమ్మెల్యేలకు పెరిగింది.
అయితే బీజేపీ మళ్లీ తన మార్కు రాజకీయంతో ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుంది. దీంతో కాంగ్రెస్ బలం ఐదుకు పడిపోయింది. ఈ ఫిరాయింపుల రాజకీయంతో బీజేపీ అక్కడ అధికారాన్ని సొంతం చేసుకుంది. కర్ణాటక, గోవా.. రాష్ట్రాల్లో కేవలం ఫిరాయింపులతోనే బీజేపీ అధికారాన్ని పొందిందని వేరే చెప్పనక్కర్లేదు. ఇక కాంగ్రెస్ కు మిగిలిన కొద్దో గొప్పో బలంలో కూడా టీఎంసీ లాగుతోంది.