ఎన్నికలు అయిపోయాయి. రాజకీయ నేతలు గెలిచిన వారు హ్యాపీగా ఉన్నారు, ఓడినవారు బాధతో ఉన్నారు. గెలిచినవారు పదవులు స్వీకరించి తమ పనుల్లో తాముంటే.. ఓడినవారు తమ ఉనికిని కాపాడుకోవడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. తదుపరి ఎన్నికలకు ఇప్పటి నుంచి వ్యూహాలను రచించుకోవడంలో వారు భిజీగా ఉన్నారు. రాజకీయ నేతలేమో అలా ఉన్నారు. ఇంతకీ సగం సగం రాజకీయ నేతల పరిస్థితి ఏమిటి? సినిమాలు చేసుకుంటూ షికారులా రాజకీయాల్లోకి వచ్చినవారు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తిదాయకమైన అంశం. ఈ సినిమా వాళ్లు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం చేస్తారా.. లేక తమ పని తాము చేసుకుంటూ రాజకీయంతో టచ్‌లో ఉంటారా? అనేది చర్చనీయాంశం అవుతోంది.
కర్ణాటకలో ప్రధానంగా ఇద్దరు నటీనటులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేశారు. వారిద్దరూ ఇండిపెండెంట్స్‌గా పోటీచేశారు. ప్రకాష్‌రాజ్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. బెంగళూరు సెంట్రల్ నుంచి ఈ నటుడు పోటీచేశాడు. అయితే ప్రజల ఆదరణ పొందలేకపోయాడు. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. ఇండిపెండెంట్‌గా పోటీచేసి ప్రకాష్‌రాజ్ ఓడిపోగా, ఇండిపెండెంట్‌గానే పోటీచేసి సుమలత విజయం సాధించారు. మండ్య నుంచి ఆమె ఎంపీగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె గెలిచింది ముఖ్యమంత్రి తనయుడి మీద. అతడు సినీనటుడు అనే విషయం కూడా తెలిసిందే.
ఎన్నికలో ఓడిన తర్వాత ఇప్పుడు ప్రకాష్‌రాజ్ ఏం చేయబోతున్నాడు? అంటే అతడి నుంచి ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. ఎన్నికల్లో ఓడించి తన చెంప మీద ప్రజలు బలమైన దెబ్బకొట్టారని ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యానించాడు. మరి దాంట్లోని ప్రకాష్‌రాజ్ నేర్చిన గుణపాఠం ఏమిటో ఆయనకే తెలియాలి. తను అనుసరించి రాజకీయ విధానమే తప్పు అని ప్రకాష్‌రాజ్ భావిస్తున్నట్టా? లేక ప్రజలు ఒకసారి ఓడించినా తను ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాబోతున్నట్టా? అనే విషయాల గురించి ప్రకాష్‌రాజ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
మోడీ మీద, బీజేపీ మీద తీవ్రమైన వ్యతిరేకతను అయితే వ్యక్తంచేస్తూ వచ్చారు ప్రకాష్‌రాజ్. ఒకవైపు సినిమాల్లో కొనసాగడం విషయంలో మాత్రం ప్రకాష్‌రాజ్‌కు అభ్యంతరాలు లేవని స్పష్టం అవుతోంది. సినిమాల్లోనే కొనసాగుతూ సోషల్ మీడియా ద్వారా రాజకీయ కామెంట్లను చేసేలా ఉన్నాడు ఈ నటుడు. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రమే రాజకీయం చేస్తే.. ఫలితాలు అలానే ఉంటాయి. నిజంగానే ప్రకాష్‌రాజ్‌కు ఎంపీగానో, ఎమ్మెల్యేగానో ప్రజలకు చేరువ కావాలనుకుంటే అంతకన్నా ముందు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ వారికి దగ్గర కావాల్సి ఉంది. మరి ఈ నటుడు ఏం చేస్తాడో చూడాల్సి ఉంది.
ఇక నిఖిల్ గౌడ మాత్రం తను ఓడిపోయినా వెనక్కు తగ్గే పరిస్థితి లేదని అంటున్నాడు. ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన అదే చెప్పారని నిఖిల్ గౌడ అంటున్నాడు. ఓడిపోయినంత మాత్రాన రాజకీయాలను వదలవద్దు.. బాగాపని చేసి ప్రజలకు చేరువకావాలి.. అని తనకు జగన్ మోహన్‌రెడ్డి సూచించారని నిఖిల్ గౌడ పేర్కొన్నారు. ఇటీవల ఈ యంగ్ పొలిటీషియన్ వెళ్లి జగన్ మోహన్‌రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఆ మీటింగ్ అనంతరం ఈ మేరకు ట్వీట్ చేశాడు నిఖిల్ గౌడ. ఎంతైనా జేడీఎస్ పార్టీ వారి కుటుంబ పార్టీ కాబట్టి నిఖిల్ రాజకీయాల్లో కొనసాగడం, ముందు ముందు మళ్లీ పోటీచేయడం కూడా ఖరారే అని చెప్పవచ్చు.
ఇక కర్ణాటకకే చెందిన ఉపేంద్ర కూడా ఇటీవలి ఎన్నికల్లో తన పార్టీ తరఫున అభ్యర్థులను పోటీలో పెట్టాడు. అయితే ఎక్కడా వారు డిపాజిట్లు సాధించిన దాఖలాలు కూడా లేవు. దీంతో ఉప్పీ కూడా ఇక కామ్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు. కర్ణాటక రాజకీయ నేతలు కానీ, జనాలు కానీ ఉపేంద్రను రాజకీయాల్లో సీరియస్ ప్లేయర్‌గా తీసుకోలేదు.
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినా తను మాత్రం రాజకీయాల్లో కొనసాగబోతున్నట్టుగా కమల్ హాసన్ ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీలో ఉంటుందని కమల్ ఇదివరకే ప్రకటించేశాడు. ఈ నేఫథ్యంలో ఆయన ఆ మాటకు కట్టుబడి ఉండవచ్చు. కమల్ హాసన్ రాజకీయాల వైపు వచ్చింది లోక్‌సభ ఎన్నికలకు ముందు మాత్రమే. అయినా కొద్దిపాటి ఓట్లను పొందాడు కమల్. ఒకవేళ కమల్ సీరియస్‌గా రాజకీయం చేస్తే, క్షేత్రస్థాయిలో పనిచేయడం ఆరంభిస్తే అతడి ప్రభావం తమిళ రాజకీయాల పై మరి కాస్త పెరగవచ్చు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని, తను సోలోగా మాత్రమే రాజకీయాలు చేస్తానంటూ కమల్ స్పష్టం చేస్తున్నాడు. ఇదే కమల్‌కు ప్లస్ పాయింట్, ఇదే మైనస్ పాయింట్ కూడా అని పరిశీలకులు అంటున్నారు.
ఇక రజనీకాంత్ పూర్తిగా రాజకీయాల్లోకి రాలేదు. వస్తారో రారో తెలియదు. ఆయన అయితే క్షేత్రస్థాయి రాజకీయాన్ని ఇంకా మొదలే పెట్టలేదు. తమిళనాడు అసెంబ్లీకి ఇంకా రెండేళ్లలో ఎన్నికలున్నాయి. ఇప్పటివరకూ తన పార్టీ నిర్మాణం విషయంలో రజనీకాంత్ చర్యలు ఏమీ తీసుకోలేదు. ఇప్పటి నుంచి పని మొదలుపెడితే అప్పటికి రజనీ పార్టీకి ఒక రూపు రావొచ్చు. అయితే ఆయన సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు! ఇక ఏపీకి సంబంధించి పవన్‌కల్యాణ్ ఏం చేయబోతున్నాడనే అంశంలో కూడా ఇంకా క్లారిటీలేదు. పవన్ స్వయంగా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఒకచోట మాత్రమే కాకుండా రెండుచోట్ల పోటీచేసి ఆయన ఓటమి పాలయ్యారు. తన ఓటమికి ఏవేవో రీజన్లను చెబుతున్నాడు పవన్ కల్యాణ్. అయితే పవన్ ఓటమికి మరెవరూ కారణం కాదు.. పవన్ కల్యాణే ఆయన ఓటమికి బాధ్యుడు అని పరిశీలకులు అంటున్నారు. అయితే పవన్ మాత్రం విషయాన్ని ఒప్పుకోవడం లేదు.
అయితే ఇప్పుడు పవన్ తన లుక్ మొత్తం మార్చేశారు. గడ్డం ట్రిమ్ చేసి మళ్లీ సినిమా హీరో లుక్‌లోకి వచ్చేశాడు. ఈ క్రమంలో అతడు మళ్లీ సినిమాల్లో బిజీ కాబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. పలువురు నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్‌లను వెనక్కు ఇవ్వలేదట పవన్ కల్యాణ్. దీంతో ఆయన మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
మళ్లీ ఎన్నికలు దగ్గర పడేంత వరకూ పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తూ పోతారని, తనకు సంపాదనకు మరో మార్గంలేదని ఆయన అనే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఆ వాదనతో ఆయన తన అభిమానులను కన్వీన్స్ చేసుకోవచ్చు. కానీ ఓటర్లను కన్వీన్స్ చేయడం మాత్రం జరిగే పనికాదు. ఇప్పడు మళ్లీ పవన్ సినిమా వైపు వెళితే ఆయనకు రాజకీయంగా పూర్తి స్థాయిలో తలుపులు మూసుకుపోయినట్టే. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వెళితే ఇక ఆయన సినిమా హీరోగా మాత్రమే మిగిలిపోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇక ఎన్నికల్లో పోటీచేసి ఓడిన మరికొందరు సినిమా తారలు కూడా ఉన్నారు. ఊర్మిల, జయప్రద వంటి వారు ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వీరు ఎంతవరకూ ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎంతవరకూ రాజకీయాల్లో ఉంటారో చూడాల్సి ఉంది. ఊర్మిల సోషల్ మీడియా ద్వారా రాజకీయాలు చేసే ప్రయత్నంలో ఉంది. ఇక జయప్రద ఓడినా ఆమె పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి.. ఆమె చరిష్మాను ఉపయోగించుకుని ఏ రాజ్యసభ సీటో పొందే అవకాశాలు ఉండవచ్చు!