రాను రాను నిర్మాతగా దిల్ రాజు కార్నర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తన సినిమాకు మరే సినిమా అడ్డంపడకూడదు, తను అనుకున్న డేట్ తనకు సోలోగా వదిలేయాల్సిందే అనే ఆయన ఆటిట్యూడ్ పై ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి సినిమాకు డేట్ ఎంత ముఖ్యమో, కంటెంట్ అంత ముఖ్యం.
అజ్ఞాతవాసి సినిమాకు పోటీలేదు. కానీ ఏమయింది? దిల్ రాజు తన శ్రీనివాస కళ్యాణం విషయంలోనూ గట్టిగా పట్టుకుని సోలో డేట్ తీసుకున్నారు. వన్ వీక్ వెనుక వచ్చిన గీత గోవిందంకు థియేటర్లు వదిలే విషయంలో పట్టుదలకు పోయారు. కానీ ఏమయింది?
ఇప్పడు 18న తన సినిమా హలోగురూ ప్రేమకోసమే సినిమా కోసం కిందామీదా అయిపోతున్నారు. నోటా సినిమాను ఆ దరిదాపుల్లోకి రానివ్వకుండా చూసారు. టైమ్ లేకపోయినా, నోటా సినిమా కిందామీదా పడి 5కు విడుదల అవుతోంది. అరవింద సమేత అంటే దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఓకె. ఇక మిగిలింది పందెంకోడి2. ఈ సినిమా విడుదలకు కూడా దిల్ రాజు అడ్డంకులు పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పందెంకోడి-2 సినిమా నిర్మాత టాగోర్ మథుతో తనకు లావాదేవీలు వున్నాయని, అవి తేలేవరకు విడుదల చేయవద్దనీ నైజాం డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ పై దిల్ రాజు వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి స్పైడర్ సినిమాను దిల్ రాజు అవుట్ రేట్ కు కొనుకున్నారని వినికిడి. అప్పటికీ దాదాపు మూడుకోట్లు తక్కువ కట్టారని తెలుస్తోంది.
ఇన్నాళ్లు ఊరుకుని, ఇప్పుడు టైమ్ చూసుకుని, సినిమా డేట్ మారుస్తారా? స్పైడర్ కాంపన్ సేషన్ ఇస్తారా? అన్న రూట్ లో దిల్ రాజు వెళ్తున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమాలో కంటెంట్ వుండాలి కానీ, ప్రతి సినిమా టైమ్ లో ఇలా డేట్ విషయంలో దిల్ రాజు తనపై వత్తిడి తేవడం సరిగ్గా లేదని ఏషియన్ సునీల్ కూడా ఆఫ్ ది రికార్డుగా ఫీలవుతున్నట్లు బోగట్టా.
దిల్ రాజు చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ప్రొడక్షన్ లో వున్నాయి. ఒకటి రామ్ సినిమా, రెండవది మహేష్ బాబుది, మూడవది వెంకీ-వరుణ్ తేజ్ ది. ఈ దసరాకు ఒకటి, సంక్రాంతికి మరోటి, సమ్మర్ కు మూడోది విడుదల ప్లానింగ్ లు వున్నాయి.
సంక్రాంతికి ఎన్టీఆర్ మీద గౌరవంతో ఆయన బయోపిక్ కు సోలో డేట్ వదిలేద్దామని అన్న సూచనలకు కూడా దిల్ రాజు నో అన్నారని తెలుస్తోంది. తన ఎఫ్ 2 విడుదల పక్కాగా వుండాల్సిందే అని పట్టుపడుతున్నట్లు బోగట్టా.
ఏమైనా నైజాంలో ఏషియన్ సునీల్ కు దిల్ రాజు సినిమా డేట్ లు కాస్త తలనొప్పిగానే మారుతున్నాయని తెలుస్తోంది.