ఒక్కో ప్రొడ్యూసర్ వస్తుంటారు. ఎవర్నో నమ్మి, పావలాతో సినిమా ఫినిష్ చేస్తామంటే రంగంలోకి దిగుతారు. పది రూపాయిలకు డేకించేస్తారు. దాంతో ఉన్నవన్నీ ఇక్కడే ఊడ్చేసి, మళ్లీ ఇటు తొంగిచూస్తే ఒట్టు అని వెళ్లిపోతారు. ఇవన్నీ తెలిసి కూడా మళ్లీ మరొకరు రెడీ అయిపోతారు, సమర్పించుకోవడానికి.
ఈ నెలలోనే ఓ సినిమా వచ్చింది. పద్దెనిమిది కోట్లు సమర్పించేసుకుని, ఇక సినిమాల జోలికి వస్తే ఒట్టు అన్నారట ఆ నిర్మాత. అలాగే ఇటీవలే మరో సినిమా వచ్చింది. సూపర్ డూపర్ హిట్ అని ప్రచారం. కానీ పాపం ఆ ఎన్నారై నిర్మాతలు మాత్రం ఇప్పట్లో సినిమాలు తీసేది లేదు అంటున్నారట. ఓ చిన్న సినిమా చేయాలని ఆఫీసు తీసి, అంతా రెడీ చేసుకుని కూడా, చాలు బాబు అనేసారట.
ఇదే నిర్మాతలతో కోన వెంకట్ లాంటి పెద్దాయిన ఓ మాంచి ప్రాజెక్టు సెట్ చేసారట.. జస్ట్ 26 కోట్లు అని. దానికి వీళ్లు. చాలు బాబు.. మూడులో చేస్తామని చెప్పి, ఎనిమిదికి డేకించారు. 26 అంటే అదెంతకు డేకుతుందో అనేసారట. పాపం సినిమా వైరాగ్యం అలా వుంటుంది. కానీ శాశ్వతంగా వుంటుందా? మళ్లీ నాలుగు రూపాయిలు చేరగానే ఇక్కడే వాలరా అన్నదే అనుమానం.