సుమారు 16 ఏళ్లగా నిరాహారదీక్ష చేస్తూ, ప్రపంచంలోనే రికార్డు స్థాపించిన షర్మిల తన లక్ష్యం పూర్తి కాకుండానే హఠాత్తుగా దీక్ష విరమించడం మణిపూర్ ప్రజలు జీర్ణం చేసుకోలేక పోతున్నారు. ఎవరినీ సంప్రదించకుండా స్వనిర్ణయంతో దీక్ష ప్రారంభించినపుడు ఆమెను ఆకాశానికి ఎత్తేసి, దీక్ష కొనసాగిస్తున్న కొద్దీ అక్కడే స్థిరంగా వుంచేసిన మణిపూర్ ప్రజలు ఆమె 'నన్ను దేవతను చేయకండి, నేను మామూలు మనిషినే, నా కంటూ ఆశలూ, అభిప్రాయాలూ వుంటాయి' అని మొత్తుకుంటూ వుంటే వినిపించుకోవటం లేదు.
షర్మిల దీక్ష విరమణ వెనుక తన ఉద్యమం విఫలమైందన్న నిస్పృహతో బాటు, తోడు కోసం మనసు పడే ఆరాటం కూడా వుందని అందరికీ తెలుసు. కానీ ఆమె సమర్థకులు దానికి అంగీకరించటం లేదు. ఆమె ప్రియుడైన డెస్మాండ్ కౌటిన్హో మీద విరుచుకు పడుతున్నారు. అతని కుటుంబం గోవాకు చెందినదంటారు కానీ 'నేను టాంజానియాలో పుట్టి అక్కడే స్థిరపడిన జంటకు పుట్టినవాణ్ని. ప్రస్తుతం బ్రిటిషు పౌరుణ్ని.' అంటాడతను. షర్మిల చేస్తున్న దీక్ష గురించి విని 2009లో ఆమెకు ఉత్తరాలు రాశాడు. ఒంటరితనంతో బాధపడుతున్న ఆమెకు క్రిస్టియన్ ఎవాంజలిజం, బుద్ధిస్ట్ విపాసనా కలిసిన అతని ఆధ్యాత్మిక దృక్పథం, భావ వ్యక్తీకరణ బాగా నచ్చాయి. జవాబులు రాసేది. ఇద్దరి మధ్య లేఖానుబంధం గట్టిపడింది. ఆమె కతను లాప్‌టాప్, రాధాకృష్ణ విగ్రహంతో సహా అనేక బహుమతులు పంపసాగాడు. చివరకు ఆమెను చూడడానికి 2011 ఫిబ్రవరిలో ఇంఫాల్‌కు వచ్చాడు. అప్పటికే అతనితో షర్మిల ఉత్తరప్రత్యుత్తరాలు నడపడం నిరసిస్తున్న మహిళా కార్యకర్తలు అతనిపై విరుచుకు పడి కొట్టారు. అతను నిరాహార దీక్ష చేపట్టడంతో రెండు రోజుల తర్వాత వాళ్లు దిగి వచ్చి ఆమెను కలవనిచ్చారు. చివరకు షర్మిలపై ఆత్మహత్యాయత్నం కేసు విచారణ నడుస్తున్న కోర్టుకి మార్చి 9న వచ్చి ఆమెను ప్రత్యక్షంగా కలిసి పలకరించాడు. ''మా వాళ్లకు అతని వేషధారణ, ప్రవర్తన నచ్చలేదు. నన్నేమైనా అంటే అతను సహించడు. దాంతో ఘర్షణ తలెత్తింది. కొంచెం వుంటే మా వాళ్లు అతన్ని చంపేసేవారు. మా వాళ్ల దృష్టిలో నేను మణిపూర్‌కు చెందిన పబ్లిక్ ప్రాపర్టీని. మరి అతనికి నేనంటే పిచ్చి యిష్టం. నా కంటూ జీవితం వుండాలని వాదిస్తాడు. అందుచేత అతనికి రక్షణ కల్పించండి'' అని షర్మిల కోర్టును కోరింది.
షర్మిల దీక్ష భగ్నం చేయడానికి ప్రభుత్వం సంధించిన మన్మథాస్త్రం ఆమెకంటె 9 ఏళ్లు పెద్దవాడైన డెస్మాండ్ అని ఆమె కార్యకర్తల అనుమానం. పైకి మాత్రం ''అతనికి తిక్కతిక్కగా మాట్లాడతాడు. మొదట్లో ఇంఫాల్ వచ్చి ఆశ్రమం కడతానన్నాడు. సరేనంటే మరి డబ్బివ్వండి అన్నాడు. ఖట్మండూకి వెళ్లాలి, నాకు ఎయిర్ టిక్కెట్లు బుక్ చేయండంటాడు. ఇలాటివాణ్ని పెళ్లి చేసుకుంటానని షర్మిల అంటే ఏం చెప్తాం?'' అంటారు. షర్మిల పెళ్లి చేసుకుని స్థిరపడడం ఆమె తల్లికి, సోదరుడికి, అనుయాయులకు ఎవరికీ యిష్టం లేదు. దీక్ష విరమణ తర్వాత ఆమె బయటకు వస్తే ఎవరూ ఆశ్రయం యివ్వలేదు. ఆమెపై దాడి చేస్తారన్న భయం కూడా కలిగింది. చివరకు రెడ్‌క్రాసు వారు తమ వద్ద పెట్టుకున్నారు. ఇది షర్మిలను బాధిస్తోంది. ''వీళ్లంతా భర్తాబిడ్డలతో సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు. నాకు మాత్రం ఆ సౌకర్యం వుండకూడదట.'' అని 2014 డిసెంబరులోనే వాపోయింది. క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ఆమెకు పులిసవారీ అయిపోయింది. దిగితే ప్రజలు చావగొడతారని, తన ప్రియుణ్ని ఖతం చేస్తారని భయం. అందుకే బెదిరింది. ఇన్నాళ్లకు తెగించి, ఏమైతే అది అయిందని నిర్ణయం తీసుకుంది. పులి నుంచి దిగిపోయింది. పులి తినేస్తుందో, జాలి పడి వదిలేస్తుందో వేచి చూడాలి.
అసలామె పులి ఎక్కిన సందర్భం ఏమిటి? 1972లో తొమ్మిది మంది పిల్లల్లో ఆఖరి పిల్లగా పుట్టిన ఆమె ఇంటరు చదివింది. సోషల్ వర్కరుగా మారి మానవహక్కులు, మహిళా హక్కులు వంటి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ వాలంటీరుగా వుండేది. నవంబరు, 2000లో సైన్యం చేతిలో బలాత్కారానికి, దౌర్జన్యానికి గురైన మహిళల వివరాలు సేకరించడానికి యిల్లిల్లూ సైకిలు మీద తిరుగుతున్న షర్మిలకు 10 మంది ప్రజలు సైన్యం దాడికి గురై మరణించిన వార్త తెలిసింది. అసాం రైఫిల్స్ వారి వాహనాలు వెళుతూండగా మణిపూర్ తీవ్రవాదులు బాంబు విసిరారు. ఒక వాహనం కొద్దిగా దెబ్బ తింది. అంతే! ప్రతీకార చర్యగా సైన్యం బస్సు కోసం వేచి వున్న పదిమంది పౌరులపై విచక్షణా రహితంగా కాల్పులు కాల్చి చంపివేసింది. మణిపూర్‌లో అమలులో వున్న సైన్యవిశేషాధికార చట్టం ఎత్తివేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ఆమె అప్పటికప్పుడు నిర్ణయించుకుంది. హితైషులు వద్దవద్దని వారించినా వినలేదు. 'నేను విజయం సాధించాకనే నిన్ను కలుస్తాను' అని తల్లితో చెప్పి 28 ఏళ్ల అవివాహిత ఐన షర్మిల దీక్ష నవంబరు 2 న ప్రారంభించింది. అలా వదిలేస్తే ఆమె చనిపోతుందని పోలీసులు భయపడ్డారు. నవంబరు 6 న ఆత్మహత్యా ప్రయత్నం కేసుపై అరెస్టు చేశారు. ఆమెకు బలవంతంగా ముక్కు ద్వారా ఆహారం ఎక్కించసాగారు. గొంతు ద్వారా నీళ్లు కూడా తాగలేదామె. 15 ఏళ్ల 9 నెలల తర్వాత దీక్ష విరమించాక ఆమె ఆహారం తీసుకునే స్థితిలో లేదు. ఆమె జీర్ణవ్యవస్థకు ఆహారాన్ని అరిగించుకునే శక్తి పోయింది. ప్రస్తుతం ద్రవాహారాల మీద బతుకుతోంది. మామూలు జీవితానికి ఎప్పటికి అలవాటు పడుతుందో చెప్పలేం. ఆమె నిరసన తెలుపుతూ వచ్చిన సైన్యవిశేషాధికార చట్టం సంగతేమిటి?
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో తలెత్తిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచడానికి బ్రిటిషు ప్రభుత్వం సైన్యానికి విశేషాధికారాలు కల్పిస్తూ చేసిన చట్టాన్నే కాస్త మార్పులు చేసి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) యాక్డ్ (ఎఎఫ్‌సిపిఎ) అని 1958లో తయారు చేశారు. ఏదైనా ప్రాంతాన్ని కల్లోల ప్రాంతంగా ప్రకటించి అక్కడకు సైన్యాన్ని పంపితే యీ చట్టం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం సైన్యాధికారులు ఏం చేసినా ఎవరూ నోరెత్తడానికి లేదు. ఏ వారంటూ లేకుండా వారు ఎవరినైనా సోదా చేయవచ్చు, ఎవరి యింట్లోకైనా ప్రవేశించవచ్చు. శాంతిభద్రతల పేరు చెప్పి ఎవరినైనా కాల్చిపారేయవచ్చు. వారికి యిమ్యూనిటీ (చట్టం నుంచి రక్షణ) వుంటుంది. చైనా మద్దతుతో ప్రత్యేక నాగాలాండ్ ఉద్యమం చేపట్టిన నాగా ఉద్యమకారుల నడుం విరచడానికి ఈశాన్య ప్రాంతాల్లో మొదట దీన్ని ప్రయోగించారు. 1997లో నాగాలతో ఒప్పందం కుదిరినా, క్రమేపీ ఈశాన్యంలోని అన్ని రాష్ట్రాలకూ విస్తరిస్తూ పోయారు. పంజాబ్‌లో 1983-97 మధ్య ఉపయోగించారు. 1990 నుంచి కశ్మీరులో దాన్ని ఉపయోగిస్తూనే వున్నారు. సైనికులు అనగానే మనకు దేశభక్తులు, దేశరక్షణ కోసం ప్రాణాలు అర్పించేవారే గుర్తుకు వస్తారు. కానీ ఆక్రమిత ప్రాంతాల్లో అతివలపై అత్యాచారాలు చేసి 'వార్ బేబీ'లకు కారకులయ్యే వారూ వీరే! అమితాధికారాలు దఖలు పడ్డాక వాటిని సక్రమంగా వినియోగించే విచక్షణ అందరు సైనికాధికారులకు వుంటుందని అనుకోవడానికి లేదు. తిరుగుబాటుదారులు ఒక సైనికుణ్ని చంపితే వాళ్లకు బుద్ధి చెప్పడానికి వందమందిని కాలుస్తారు. వారిలో సాధారణ పౌరులు, అమాయకులు కూడా వుంటారు. కొన్ని సందర్భాల్లో వారు చేసినది తప్పని తెలిసినా ప్రభుత్వం బాహాటంగా చెప్పలేదు. వాళ్లను వెనకేసుకుని రావల్సి వస్తుంది. కశ్మీర్‌లో యీ చట్టం పెద్ద వివాదాస్పద అంశం. దాన్ని ఎత్తి వేయించేస్తామని స్థానిక నాయకులు ఎన్నికలలో వాగ్దానాలు చేస్తారు కానీ కేంద్రం ఒప్పుకోదు. సైన్యం చేసిన అత్యాచారాలకు కశ్మీరు వారు తక్కిన భారతీయులందరినీ నిందిస్తారు. ఈశాన్య భారతంలోను అదే పరిస్థితి. 2004 జులైలో తంగియమ్ మనోరమ అనే మణిపూర్ మహిళను సైనికులు బలాత్కారం చేశారు. దానికి నిరసనగా మధ్యవయస్కులైన కొందరు మహిళలు ''ఇండియన్ ఆర్మీ, రేప్ అజ్'' అంటూ బ్యానర్ రాసి, దాన్ని వెనక్కాల నగ్నంగా నిలబడి నిరసన తెలిపారు. ఇండియన్ ఆర్మీ, తద్వారా కేంద్రప్రభుత్వం మొత్తం ఆ నింద భరించవలసి వచ్చింది.
ఇంత జరుగుతున్నా మణిపూర్ రాష్ట్రప్రభుత్వాలేవీ ఆ చట్టాన్ని ఎత్తివేయించే ప్రయత్నం చేయలేదు. ప్రతి ఏడాదీ ఆ చట్టాన్ని పొడిగించాలని సిఫార్సు చేస్తూ పోయారు. కొన్ని ప్రాంతాల్లో ఎత్తివేశాం అంటూ సంజాయిషీ చెప్తూ వచ్చారు. కేంద్రంతో పోరాడి ఎత్తివేయిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టుకోవడానికి దాన్ని దాచి పెట్టుకుంటూ వచ్చారు. సైన్యం చేతిలో హతులైన వారి వితంతువులు సంఘంగా ఏర్పడి సైన్యం చట్టాన్ని అతిక్రమించిన 1528 కేసులను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ చట్టం ఎత్తివేస్తే కశ్మీరు వాళ్లూ ఎత్తివేయమంటారన్న భయం కేంద్రానిది. అందువలన యథాతథస్థితి కొనసాగి, పోనుపోను సాధారణ ప్రజలు ఆ పరిస్థితికి అలవాటు పడిపోయారు. ఆ చట్టం దారి చట్టానిదే. దాన్ని ఎత్తివేయాలంటూ దీక్ష చేస్తున్న షర్మిల దారి షర్మిలదే. దశాబ్దాల తరబడి దీక్ష సాగుతూ వుంటే ఎవరు మాత్రం రోజూ వెళ్లి పలకరిస్తారు? విశేషాధికారాలు కానీ, దీక్ష కానీ కొద్ది రోజుల పాటు, లేదా నెలల పాటు వుంటే ప్రభావం చూపిస్తుంది. ఏళ్ల తరబడి సాగితే అది రొటీన్ అయిపోతుంది. ప్రజలు ఎవరి యిళ్లల్లో వాళ్లు హాయిగా వుంటూ సుష్టుగా తింటూ, కాపురాలు చేసుకుంటూ, పిల్లలు కంటూ పోతున్నారు. కానీ వారి కోసం షర్మిల మాత్రం ఎండుతూ, ఒంటరిగా బతుకీడ్చాలి అనడం ఏం న్యాయం? ఎన్నాళ్లు చేసినా వాళ్లీ చట్టం ఎత్తివేసేట్లు లేరు, నేను విరమిస్తా అని షర్మిల ఏళ్ల తరబడి మొత్తుకుంటున్నా ఠాఠ్ కుదరదు అంటున్నారు వీళ్లు. 'వేసేటప్పుడు వేపకొమ్మ, తీయబోతే అమ్మోరు' అని సామెత. 'నేను అమ్మోరిని కాను, వేపకొమ్మనే' అని వేపకొమ్మ మొత్తుకుంటున్నా వీళ్లు వినటం లేదు.
ఆర్ కె నారాయణ్ ''గైడ్'' నవలలో (సినిమా కూడా వచ్చింది) జీవితంలో ఢక్కామొక్కీలు తిని, నేరం చేసి జైలుకెళ్లి వచ్చినతనిపై అనుకోని పరిస్థితుల్లో దైవత్వం ఆపాదించబడుతుంది. నీళ్ల తగాదాలో ఊళ్లో జనం కొట్టుకుంటున్నారని విని అతను 'నేను యివాళ మీరు పంపిన అన్నం, నీళ్లు ముట్టను' అని కోపంతో అంటే అది విన్న మందబుద్ధి ఒకడు 'వర్షం వచ్చేవరకూ స్వామీజీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తారట' అని టాంటాం వేసేస్తాడు. దాంతో అందరూ అతన్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇక దీక్ష చేయక తప్పని పరిస్థితి వస్తుందతనికి. దొంగతనంగా పారిపోదామన్నా పారిపోలేడు. తనపై ఆపాదించబడిన యీ బలవంతపు దైవత్వాన్ని భరించి, చివరకు అతను మరణిస్తాడు. షర్మిల బతుకు కూడా అలాగే ముగిసి వుండేది – ఆమె తెగించి దీక్ష మానేయకపోతే! ఇన్నాళ్లూ చేసిన పోరాటం వ్యర్థమైందని అనిపోతారని ఆమె 'నేను రాజకీయాల్లోకి వస్తాను, ఆ చట్టం ఎత్తివేసేదాకా పోరాడతాను, అప్పుడే మా అమ్మను చూస్తాను' అంటోంది. దీక్ష విరమణ తర్వాత ప్రజాగ్రహం చవి చూశాక ఆమె రాజకీయాల్లోకి వచ్చే సాహసం చేస్తుందని అనుకోను. షర్మిల కథ ఓటమికి ఉదాహరణగా చూడకూడదు. ఒక నిజాయితీ ఐన ప్రయత్నంగా, జీవితేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతీకగా చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)