కర్ణాటక సిఎమ్ గా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ మాట ఏమో కానీ, ఆ తరువాత ఆయన కొడుకు సినిమా బాకీలు తెలుగు నాట తీరుస్తారా? అన్నది అనుమానంగా వుంది. కుమారస్వామి రాజకీయ నాయకుడే కాదు, సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. పైపెచ్చు కొడుకు నిఖిల్ గౌడను భారీగా తెలుగు, కన్నడ హీరోగా లాంచ్ చేసారు. అందుకోసం జాగ్వార్ అంటూ ఓ భారీ సినిమా నిర్మించారు.
జాగ్వార్ సినిమా నిర్మించినపుడు కుమారస్వామి స్వయంగా హైదరబాద్ వచ్చారు. మీడియాతో ముచ్చట్లు జరిపారు. వైజాగ్ రాజు అనే తన మిత్రుడి ద్వారా జాగ్వార్ సినిమా విడుదల వ్యవహారాలు జరిపించారు. ఈ సందర్భంగా భారీగా పబ్లిసిటీ చేయించారు. కానీ అక్కడే వచ్చింది చిక్కు. ఆ సినిమా కాస్తా బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ మంది. అంతే ఇక కుమారస్వామి మరి కనిపించలేదు. వైజాగ్ రాజు కూడా అంతే.
దాంతో మీడియాకు లక్షల బాకీలు అలాగే వుండిపోయాయి. ఎవర్ని అడగాలో, ఎవరు ఇస్తారో తెలియక మీడియా సైలంట్ అయింది. మరి కుమారస్వామి సిఎమ్ అయితే ఆ శుభ సందర్భంలో అయినా మీడియా బాకీలు తీరుస్తారేమో? లేదా మరో భారీ సినిమా కొడుకుతో మొదలుపెట్టినపుడయినా ఇక్కడకు వస్తారేమో?