కలెక్షన్లు… ‘కలుపు’ మొక్కలు

ఒకప్పుడు సినిమా హీరోల ఫ్యాన్స్‌కు కలెక్షన్ల లెక్కలపై భయంకరంగా పట్టింపు వుండేది. ఒక తరహా రికార్డు అనికాదు. ఎన్ని షోలు హవుస్‌ఫుల్‌ అయ్యాయి. యాభై సెంటర్లు ఎన్ని, వంద సెంటర్లు ఎన్ని? ఫుల్‌రన్‌ ఎన్ని?…

ఒకప్పుడు సినిమా హీరోల ఫ్యాన్స్‌కు కలెక్షన్ల లెక్కలపై భయంకరంగా పట్టింపు వుండేది. ఒక తరహా రికార్డు అనికాదు. ఎన్ని షోలు హవుస్‌ఫుల్‌ అయ్యాయి. యాభై సెంటర్లు ఎన్ని, వంద సెంటర్లు ఎన్ని? ఫుల్‌రన్‌ ఎన్ని? డైరక్ట్‌ సెంటర్లు ఎన్ని? షిఫ్టింగ్‌లు ఎన్ని? ఇలా ఒకటి అని కాదు. ఎన్నిరకాలో? పైగా ఫ్యాన్స్‌ అందరికీ ఈ లెక్కలు ఫింగర్‌ ప్రింట్స్‌ మీద వుండేవి.

ఇప్పటికీ చాలాచోట్ల కింద సెంటర్లో అంటే బి.సి, సెమీ అర్బన్‌ సెంటర్లలో ఫ్యాన్స్‌ ఈ రికార్డులు పట్టించుకోవడం జరుగుతోంది. అయితే ఎప్పుడయితే శతదినోత్సవాలు, అర్థ శత దినోత్సవాలు తగ్గిపోయాయో, కేవలం టోటల్‌ కలెక్షన్‌ ఫిగర్లు మాత్రమే ఎక్కువ పట్టించుకుంటున్నారు. టౌన్‌ రికార్డు, థియేటర్‌ రికార్డు, ఏరియా రికార్డు ఇవి మాత్రమే ఇప్పుడు కీలకం అయ్యాయి. దాంతో పాటు తొలిరోజు, తొలి వీకెండ్‌, ఫుల్‌రన్‌ కలెక్షన్లు కీలకంగా భావిస్తున్నారు.

ఇదంతా ఓ విధంగా సరదా సరదా సంగతులే. ఫ్యాన్స్‌ తమ తమ హీరోలను అభిమానిస్తూ, ఆరాధించడంలో భాగమే. ఫ్యాన్స్‌కు మాత్రం ఇవి పరిమితం అయినంత వరకు బాగానే వుండేవి. కానీ రాను రాను హీరోలు కూడా వీటిని పట్టించుకోవడం మొదలుపెట్టారు. హీరోలు వీటిని పట్టించుకునేది రికార్డుల కోసం కాదు. రెమ్యూనిరేషన్లు, మార్కెట్‌ పెంచుకోవడం కోసం తమ మార్కెట్‌ ఇంత వుంది, తమ సినిమాల టర్నోవర్‌ ఇంత అనిచెప్పి, దానికి అనుగుణంగా పారితోషికాలు పెంచడం అన్నది ఓ స్ట్రాటజీగా మారింది.

దీనికితోడు మల్టీ ఫ్లెక్స్‌లు పెరగడం, టికెట్‌ రేట్లు పెరగడం వంటివి కలిసి వస్తున్నాయి. నలభైకోట్ల మార్కేట్‌ యాభైగా మారింది. డెభైగా మారింది. ఇప్పుడు వందకోట్లు అన్నది ఫ్యాషన్‌గా మారింది. టాప్‌ టెన్‌, టాప్‌ ఫైవ్‌ల్లో వుండడం అన్నది లక్ష్యంగా మారింది. ఈ లక్ష్య సాధనకు అటు అభిమానులతో పాటు ఇటు హీరోల ప్రయత్నాలు కూడా పెరిగాయి.

హీరోలు కూడా సినిమాల మార్కెటింగ్‌లో జోక్యం చేసుకుంటున్నారు. ఏ ఏరియా ఎవరికి అమ్ముతున్నారో, ఎవరికి అమ్మాలో అన్నది కూడా కొంతమంది హీరోలు పట్టించుకుంటున్నారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఏరియాల కొనుగోలు దార్లు హీరోల గుడ్‌లుక్స్‌లో వుండడానికి కిందామీదా అవుతున్నారు. అదే టైమ్‌లో నిర్మాతలు కూడా హీరోలతో మళ్లీ మళ్లీ సినిమాలు చేసే అవకాశం కోసం వారు చెప్పినట్లు, లేదా వారికి నచ్చేటట్లు చేస్తున్నారు. దీనికితోడు హీరోల పర్సనల్‌ పీఆర్వోల సంగతి సరేసరి. తమ తమ హీరోల కోసం, అభిమానుల కోసం వాళ్ల ప్రయత్నం వాళ్లు చేస్తున్నారు.

సో, ఇలా అందరూ కలిసి చేసేది ఏమిటంటే, కలెక్షన్ల ఫిగర్లను మ్యానిప్లేట్‌ చేయడం. ఫేక్‌ ఫిగర్లు సర్క్యులేట్‌ చేయడం. అసలు అంకెలకు కొంత కలపడం. ఇలా మొత్తంమీద ఫేక్‌ కలెక్షన్లు సృష్టించడం.

కలెక్షన్ల లెక్కలు
కలెక్షన్ల లెక్కలు అన్నది ఓ బ్రహ్మ ప్రదార్థం. కేవలం థియేటర్‌ నిర్వాహకులకు, బయ్యర్లకు తప్ప, మరెవరికి అసలు ఫిగర్‌ తెలియదు. అది వాస్తవం. కొన్నిచోట్ల బయటకు రావచ్చు కొన్నిచోట్లు కాస్త అటు ఇటుగా బయటకు రావచ్చు. కానీ పెద్ద హీరోల సినిమాల వరకు వచ్చేసరికి మాత్రం ఫిగర్లు కేవలం బయ్యర్‌కు, ఎగ్జిబిటర్‌కు  మధ్యనే వుంటాయి. నిర్మాతకు కూడా సరిగ్గా రాకపోయే అవకాశం కొంత వరకు వుంది.

ఇలా ఎందువల్ల అంటే? బ్లాక్‌.. సినిమాను కొన్నపుడు కొంతయినా బ్లాక్‌ పోర్షన్‌ అనేది వుంటుంది. ఆ బ్లాక్‌ పోర్షన్‌ కోసం, అలాగే టాక్స్‌ ఎగ్గొట్టడం కోసం డిసిఆర్‌లు అనే డైలీ కలెక్షన్‌ రిపోర్టులు ఒకటికి రెండు విధాల తయారుచేయడం అన్నది కామన్‌ ప్రాక్టీస్‌ అయిపోయింది.

ఎలా కలుపుతారు?
అసలు ఫేక్‌ కలెక్షన్లు ఎలా తయారవుతాయి? ఈ ప్రశ్నకు ఒక సమాధానం వుండదు. రకరకాలుగా ఈ కలుపుడు అన్నది వుంటుంది. ఇప్పుడు సోషల్‌ మీడియా అవేర్‌నెస్‌ పెరిగింది. ఫ్యాన్స్‌, యాంటీ ఫ్యాన్స్‌ కాస్త చురుగ్గా వుంటున్నారు కాబట్టి, సినిమా విడుదలయిన తరువాత ఈ కలుపుడు వ్యవహారం రకరకాలుగా జరుగుతోంది.

థియేటర్‌ దగ్గర డిసిఆర్‌లు రెండురకాలుగా తయారుచేయడం. కేవలం కలెక్షన్లు చెప్పడం కోసం ఒకటి. లేదా అసలు థియేటర్‌ నుంచి బయటకు కలెక్షన్లు చెప్పడమే రెండు రకాలుగా చెప్పడం కామన్‌ అయిపోయింది. కానీ ఓ థియేటర్‌ ఫుల్‌ అయితే ఎంత వస్తుందన్నది ఫ్యాన్స్‌కు కంఠతా వచ్చు. అందుకే హవుస్‌ఫుల్స్‌ వున్నంత వరకు ఈ కలుపుడులు తీసివేతలు వుండవు. కాస్త కలెక్షన్లు తగ్గిన తరువాత కలుపుడులు మొదలవుతాయి.

తొలిరోజు కలెక్షన్లకు ఫిక్స్‌ హైర్‌లు, ఎంజిలు కలపడం అన్నది ఓ పద్దతి. దానివల్ల తొలిరోజు రికార్డులు తయారవుతాయి. ఇక తొలివారం సైలంట్‌గా వుంటారు. అందరి దృష్టి కలెక్షన్ల మీద వుంటుందని, ఆ తరువాత సైలంట్‌గా రోజుకు ఇంత అని కలపడం మొదలవుతుంది. వున్నట్లుండి కలెక్షన్లలో జంప్‌లు వస్తాయి.

ఇక కొత్త పద్దతి ఒకటి తయారయింది. బయ్యర్‌నే షోకి థియేటర్‌కు ఖాళీగా మిగిలిపోయిన టికెట్‌లు అమ్ముడైపోయినట్లు డిసిఆర్‌లు రాయించడం. వీటివల్ల టాక్స్‌లు కట్టాల్సి రావడం, ఇలాంటి సమస్యలు వస్తాయి కదా? అన్న అనుమానం కామన్‌. కానీ రకరకాలు లెక్కలు, నెంబర్‌ టూ లెక్కలు ఇవన్నీ మామూలే. ఖైదీ నెంబర్‌ 150కి వందకోట్లకు పై వసూళ్లు వచ్చాయని అప్పట్లో చెప్పుకున్నారు. ఇప్పటికీ రికార్డుల్లో అలాగే వుంది.

కానీ ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు నిర్మాతగా రామ్‌ చరణ్‌ 75కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్లు చెప్పారని ఈ మధ్యనే వార్తలు వచ్చాయి.

ఆ లెక్కలు బయటకు రావు
జీఎస్టీ, ఇన్‌కమ్‌ టాక్స్‌, ఇతర అధారటీలకు నిర్మాతలు చూపించే లెక్కలే అసలు సిసలైనవి అనుకోవాలి. ఆఫ్‌కోర్స్‌ పన్నులు ఎగవేయడానికి, బ్లాక్‌లో చేసిన పేమెంట్‌లకు సర్దుబాటు చేయడానికి కొంత కలెక్షన్లు తగ్గించడం కామన్‌. అయితే అది మరీ ఎక్కువశాతం వుండదు. మహా అయితే ఓ పాతికశాతం వుంటుంది అనుకోవచ్చు. ఆ లెక్కలు కనుక బయటకు వస్తే, అసలు కలెక్షన్ల లెక్కలు తేలతాయి.

ఓవర్‌ సీస్‌ పక్కా
ఓవర్‌ సీస్‌లో మాత్రం ఈ కలుపుడు మతలబులు వుండవు. అక్కడ అంతా ఆన్‌లైన్‌ సేల్‌ కాబట్టి, ఎక్కడి లెక్కలు అక్కడ, ఎప్పటి లెక్కలు అప్పుడు పక్కాగా తెలిసిపోతుంటాయి. అక్కడ రికార్డులు కావాలి అంటే ఒకటేమార్గం. హీరోలే డబ్బులు పంపించి, టికెట్‌లు కొనిపించడం. అలా చేయడం వల్ల యాభైశాతం థియేటర్లకు పోయినా, ఓ యాభైశాతం బయ్యర్‌ వాటాగా మళ్లీ వెనక్కు వచ్చి, హీరోలకే చేరుతాయి. కానీ ఇలాంటి వ్యవహారాలు చాలా రేర్‌గా జరుగుతుంటాయి.

మనదగ్గర కూడా కలెక్షన్ల లెక్కలు పూర్తిగా పక్కాగా వుండాలంటే ఆన్‌లైన్‌ సేల్‌ రావాల్సి వుంది. పూర్తిగా ఆన్‌లైన్‌ సేల్‌ అది కూడా టాక్స్‌ అధారిటీలతో లింక్‌ వుండి వస్తే కనుక, అటు ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుంది. ఇటు అసలు సిసలు లెక్కలు కనిపిస్తాయి.

అంతవరకు ఈ కలుపుడు వ్యవహారం ఇలా సాగుతూనే వుంటుంది.

రూ.20 తేడా.. 20 కోట్లు దాటించిన వైనం
చిల్లర శివాలక్ష్మి అని సామెత. నైజాంలో గవర్నమెంట్‌ జీవో అబేయన్స్‌లో వున్న వైనం అండగా కోర్డు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు సినిమా ఎగ్జిబిటర్లు. దాంతో పదిరూపాయల నుంచి నలభై రూపాయల మేరకు రేటు పెరిగింది. మరీ వందకు యాభై, వందకు వందా పెంచితే (ఆంధ్రలో మాదిరిగా) ఏమోకానీ, పది, ఇరవై అంటే జనాలు పెద్దగా లెక్క చేయరు. కానీ అదే కలిసివచ్చింది.

కనీసం అయిదు వందల స్క్రీన్లు, రోజుకు నాలుగు ఆటలు, టోటల్‌గా ఎన్ని షోలు, ఎన్ని ఆటలు? ఎన్ని టికెట్‌లు? వాటి ఈ పది, ఇరవై చిన్న మొత్తాలను మల్టిపై చేస్తే? ఎంత అదనపు ఆదాయం. నైజాంలో గత సినిమాలకు లేని ఈ సదుపాయం అరవింద సమేతకు లభించింది. నైజాం బయ్యర్‌ దిల్‌రాజు, నైజాంలో ఎక్కువ థియేటర్లు చేతిలో వున్న ఏషియన్‌ సునీల్‌ను వత్తిడి చేసి మరీ ఈ రేట్ల పెంపుపై అనుకూలంగా వుండేలా చేసారని ఇండస్ట్రీ ఇన్‌సైడ్‌ సర్కిళ్ల బోగట్టా.

ఎందుకంటే ఆయన ఈ సినిమాను 17 కోట్లకు కొన్నారు. దానికి ఖర్చులు కనీసం రెండుకోట్లు అయినా వుంటాయి. లోకల్‌ పబ్లిసిటీ వగైరా. అందువల్ల ఇరవైకోట్లు వస్తేకానీ లాభం వచ్చినట్లు కాదు. అందుకే రేట్ల పెంపు తప్పలేదు. ఈ విధంగా అదనపు ఆదాయం కనీసం కోటి నుంచి రెండుకోట్లు వుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా కడుతున్నాయి.

దీనికితోడు సిటీలో మరికొన్ని చోట్ల డిసిఆర్‌ల్లో షోకి ఇన్ని టికెట్‌ల వంతున కలిపిన వైనం వుండనే వుందని టాక్‌ వినిపిస్తోంది. ఆ విధంగా మొత్తంమీద ఇప్పటికి నైజాంలో ఇరవైకోట్లు దాటేసింది అని అరవింద సమేత వీరరాఘవపై ట్వీట్లు, వార్తలు వచ్చేసాయి. కానీ వాస్తవ అంకెలు వేరు అని ఇండస్ట్రీ ఇన్‌సైడ్‌ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఇప్పటికి అసలు ఫిగర్‌ 18కోట్ల దగ్గరే వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

లెక్కలు క్లోజ్‌ చేసినపుడు నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్‌ లెక్కలు చూపించినపుడు ఇవి బయటకు వస్తాయని అంతవరకు ఈ రికార్డులు ఇలాగే వుంటాయని టాక్‌ వినిపిస్తోంది. అరవిందకు ఇంత పట్టుపట్టి చేయడం వెనుక విజయ్‌ దేవరకొండ గీత గోవిందం రికార్డు దాటి తీరాలనే పట్టుదల వున్నట్లు వినిపిస్తోంది. ఆ సినిమా నైజాంలో 21కోట్లకు పైగానే వసూలు చేసింది.

రంగస్థలం-గీతగోవిందం
రంగస్థలం సినిమా నైజాంలో 26 కోట్లకుపైగా వసూలు చేసింది. గీతగోవిందం 22 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ మహేష్‌ బాబుతో వున్న సన్నిహిత సంబంధాలు కావచ్చు, భరత్‌ అనే నేను సినిమా అప్పుడే విడుదల కావడం వల్లకావచ్చు, రంగస్థలం నిర్మాతలు ఆ సినిమా కలెక్షన్లను ప్రచారం చేసే విషయమై దృష్టి పెట్టలేదు.

ఇక గీతగోవిందం ది మరో సమస్య. అది నైజాంలో ఇంత వసూలు చేసింది అంతవసూలు చేసింది అని హడావుడి చేస్తే మెగా హీరోల రికార్డులు గల్లంతు అవుతాయి. పైగా ఆ సినిమా నిర్మించింది మెగాక్యాంప్‌నే. అందవల్ల దాని లెక్కలు బయటకు సరిగ్గారాలేదు.

కానీ అరవిందకు అలాంటి అడ్డంకులు, సమస్యలు ఏవీలేవు. అందుకే దాని అంకెలు దానికి తయారవుతున్నాయి. దాని రికార్డులు దానికి రెడీ అవుతున్నాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. 
-ఆర్వీ

జూనియర్ ఎన్ఠీఆర్ స్పెషల్ ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్ కోసం క్లిక్ చేయండి