కాస్టింగ్ కౌచ్. సినిమాల వరకు ఇదే పదం వాడుతూ వుండొచ్చు. కానీ చాలా రంగాల్లో అమ్మాయిలను ఎక్స్ ప్లాయిట్ చేయడం అన్నది వుంది. ఆఖరికి అది క్రీడారంగంలో కూడా. అవకాశాలు కావాలంటే, తమను సంతృప్తి పరచాలనే దరిద్రపు వ్యవహారం దాదాపు చాలా రంగాల్లో చోటు చేసుకుంటూ వుంటుంది. ఆ పాయింట్ ను కూడా డియర్ కామ్రేడ్ సినిమాలో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.
డియర్ కామ్రేడ్ లో హీరోయిన్ రష్మిక క్రికెటర్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమెకు కోచ్ నుంచి ఈతరహా లైంగిక వేధింపులు ఎదురవుతాయని, వాటిని కాస్త కీలకంగానే డిస్కస్ చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమాలో కీలకభాగం ఈ సమస్య చుట్టూ, దాని పరిణామాల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.
కామ్రేడ్ సినిమాలో క్యాంపస్ రాజకీయాలు, స్టూడెంట్ యూనియన్ల వ్యవహారాలు వుంటాయన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ కోచ్ ల వేధింపులు కూడా అన్నమాట. అయితే కేవలం అలా ఓ కాలేజీ స్టోరీ అల్లకుండా, దీని మధ్య ఓ ప్రేమకథను ఇమిడ్చినట్లు కనిపిస్తోంది. భరత్ కమ్మ డైరక్షన్ లో తయారైన ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించింది.