నిర్మాతల మండలితో సంబంధం లేకుండా అరడజను మందో, అంతకన్నా ఎక్కువ మందో బయట నానా హడావుడి చేస్తున్నారు. చానెళ్లకు ప్రకటనలివ్వడంపై కిందా మీదా అవుతున్నారు.దీని మీద నానా హడావుడి జరుగుతోంది. మొదట్నించీ వీళ్లది ఒకటే మాట. దీనికి కౌన్సిల్ కు సంబంధలేదని. ఇప్పుడు తాజగా తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఈ ఎనిమిది మందిపై కస్సుమన్నారు. కౌన్సిల్ ను నీరుగారుస్తున్నారన్నారు.
తాజాగా కౌన్సిల్ కూడా గుట్టుచప్పుడు కాకుండా ఆ ఎనిమిది మందితో తమకు సంబంధం లేదంటూ ఓ నోటీసు తగిలించిందని వినికికి. అదికౌన్సిల్ చెప్పేదేమిటి? వాళ్లే చెబుతున్నారు కదా..తమ చర్యలకు, కౌన్సిల్ కు సంబంధం లేదని. మరి అలాంటపుడు ఇలా ఓ తూతూ మంత్రపు ప్రకటన చేసి ఏం లాభం? ఓ సంస్థ సభ్యులు కొంత మంది కలిసి ఆ సంస్థతో సంబంధం లేకుండా కొన్ని పనులు చేస్తున్నపుడు, దాని వల్లసంస్థకు ఇబ్బంది వచ్చినపుడు సాధారణంగా ఏం చేస్తారు. వారిని సంస్థ నుంచి సాగనంపుతారు. అలా కాకుండా వారికి మాకు సంబంధం లేదనిచెప్పినంత మాత్రాన ఒరిగేదేమిటి?
తమ నిర్ణయాలే ఫైనల్ అని కౌన్సిల్ అంటోంది. ఆ ఎనిమిది మంది నిర్ణయం మిగిలిన వారు పట్టించుకోనక్కరలేదంటోంది. మరి ఆ ఎనిమిదిమంది మాత్రం చిన్నవాళ్లు కాదు. వాళ్లతో పని వున్నవాళ్లు అనేకమంది వుంటారు. ఎందుకంటే ఈ ఎనిమిదిమందిలో కొంత మంది థియేటర్లు చేతిలో వుంచుకున్నారు కాబట్టి. వీళ్లు తమ మాట పట్టింపు విషయంలో చాలా కచ్చితంగా వుంటారు.
దీనికి చిన్న ఉదాహరణ. ఓ నిర్మాతకు థియేటర్ కూడా వుంది. ఆ నిర్మాత తీసిన సినిమాను ఈ ఎనిమిది మందిలో ఒకరైన పెద్దమనిషికి ఇవ్వలేదు. వేరే బయ్యర్ లేదా డిస్ట్రిబ్యూటర్ కు ఇచ్చాడు. అప్పటి నుంచి, ఈ పెద్దమనిషి తాను కొన్న లేదా పంపిణీ చేస్తున్న సినిమాలను ఆ థియేటర్ కు ఇవ్వడం మానేసాడు.
అందువల్ల కౌన్సిల్ బలమైనదా, ఈ ఎనిమిది మంది బలమైన వారా అన్న డిస్కషన్ పాయింట్ కు వస్తే వీళ్లదే బలం అని అంగీకరించాలి. లేకుంటా వారు కౌన్సిల్ ను ధిక్కరించి తమ దారిన తాము ఎలా ముందుకు వెళ్లగలుగుతారు?