ఒకేసారి రెండు సినిమాలు పూర్తయితే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఏ సినిమాను ముందు విడుదల చేయాలనే విషయంపై నిర్మాతల మధ్య సయోధ్య ఉండదు. ఫలితంగా ముసుగులో గుద్దులాట. అంతర్గత కుమ్ములాట. నాగచైతన్యకు సంబంధించిన 2 సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది.
లెక్కప్రకారం నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా ముందు విడుదలవ్వాలి. కానీ అనుకోని విధంగా శైలజారెడ్డి అల్లుడు రెడీ అయింది. దీంతో సవ్యసాచికి చెక్ చెప్పేందుకు శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నారు. పనిలోపనిగా ఓ ఫేక్ స్టిల్ (నిజానికి ఇది ఫేక్ కాదు) కూడా విడుదల చేసి బజ్ క్రియేట్ చేశారు. దీంతో ఆడియన్స్ ఫోకస్ మొత్తం శైలజారెడ్డి అల్లుడు పైకి మళ్లింది.
ఇంత జరుగుతుంటే సవ్యసాచి మేకర్స్ ఊరుకుంటారా. పైగా ప్రమోషన్ లో ఆరితేరిన బ్యాచ్ అది. వెంటనే రంగంలోకి దిగింది. శైలజారెడ్డి అల్లుడు సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తుంటే.. వీళ్లు ఏకంగా టీజర్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఆదివారం సవ్యసాచి టీజర్ రాబోతోంది. రేపోమాపో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా రానుంది.
ఇలా నాగచైతన్యకు చెందిన ఈ రెండు సినిమాల యూనిట్ల మధ్య తెరవెనక చాలా రచ్చ నడుస్తోంది. తమ సినిమానే ముందు రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రెండు సినిమాల యూనిట్లు ముసుగులో గుద్దులాడుకుంటున్నాయి. ఇగోలకు పోయి మినిమం గ్యాప్ లో 2 సినిమాల్ని రిలీజ్ చేస్తే అది ఆ రెండు సినిమాలకే కాదు, నాగచైతన్య కెరీర్ కు కూడా నష్టం.
ప్రస్తుతానికైతే ఈ రెండు సినిమాలపై ఎలాంటి క్లారిటీలేదు. మరీ ముఖ్యంగా నాగార్జున కూడా ఈ వివాదానికి కాస్త దూరంగా ఉన్నాడు. ఎందుకంటే అటు సితార, ఇటు మైత్రీ.. రెండూ పెద్ద సంస్థలే. వీటి మధ్య రాజీకుదర్చడం అంత ఈజీకాదు. ఏదేమైనా సవ్యసాచి టీజర్ రిలీజైతే రచ్చ పీక్స్ కు వెళ్లడం ఖాయం.