హమ్మయ్య మొత్తానికి పవన్ బాబు సైకిల్ ఎక్కేసారు. రెండు మూడేళ్లుగా సైకిల్ తో దోస్తీ చేస్తూనే వున్నారు. అయినా సైకిల్ నాకేమీ ప్రెండ్ కాదు. తప్పు చేస్తే ఎవర్ని అయినా నిలదీస్తా అని అంటూనే వున్నారు. ఆఖరికి ఇక ఎన్నికలు దగ్గరకు వస్తాయని ఫీలర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఇటీవల జిల్లాల టూర్లకు వెళ్లి తన ముసుగు తీసేసారు.
చంద్రబాబు పై ప్రేమను, జగన్ అంటే వ్యతిరేకతను ఆయన మొత్తానికి వెళ్లగక్కేసారు. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడడం వేరు, కోర్టులు ఏ సంగతీ తేల్చకుండానే జగన్ అవినీతిపరుడు అని ఫిక్సయిపోవడం వేరు. పవన్ ఆ విధమైన ఫిక్సేషన్ కు వచ్చేసారు. దాంతో జనాలకు ఓ క్లారిటీ వచ్చేసింది.
ప్రజారాజ్యం కాంగ్రెస్ తో వెళ్లినట్లు, పవన్ బాబు జనసేన తెలుగుదేశంతో కలిసే ముందుకుసాగుతుందని క్లియర్ అయింది. దీనికి మద్దతు అన్నట్లుగా పవన్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి సినిమా కోసం ఓస్టిల్ ఇవ్వాళ వదిలారు. పవన్ సైకిల్ ఎక్కిన స్టిల్ ఇది.
ఇంకేముంది. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఫ్లెక్సీలు వేయించుకోవడానికి వీలయిన స్టిల్ దొరికేసింది. కానీ ఒకటే సమస్య, ఈ స్టిల్ లో నోటిలో మాంచి తోలు బెల్ట్ కూడా వుంది. దీనికి వేరే అర్థం చెబుతారేమో.
సైకిల్ ఎక్కి, పవన్ బాబు వైకాపాను బెల్ట్ తో చీల్చి చెండాడుతారు అని తెలుగుదేశం వాళ్లు ప్రచారం చేసుకోవచ్చేమో? లేదా బెల్ట్ లేకుండా ఓ స్టిల్ కూడా తీసే వుంటారు. అది ఎప్పుడైనా అందుకోవచ్చమే? మొత్తానికి సైకిల్ ఎక్కిన పవన్ బాబు, బెల్డ్ అనే ఆయుధాన్ని ధరించి యుద్దానికి బయల్దేరారు. పహరా హుషార్.. వైకాపా.