తమిళ హీరో విశాల్, తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పేయాలనుకున్నాడు. అనూహ్యంగా ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల వేళ, నామినేషన్ ప్రక్రియలోనే బోల్తాపడ్డాడు. కారణాలేవైతేనేం, నామినేషన్ కూడా సరిగ్గా వేయలేకపోయాడన్న విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు విశాల్. ఈలోగా, నడిగర్ సంఘంలో విశాల్‌కి వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు షురూ అయ్యాయి. ఇంత గందరగోళం నడుమ, విశాల్, ఎఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపి మరోమారు వార్తల్లో వ్యక్తిగా మారాడు.
ఇందులో వింతేముంది.. అనుకోవడానికి వీల్లేని పరిస్థితి. సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులపై ప్రశంసలు గుప్పించడం షురూ చేశారంటే, తెరవెనుక 'రాజకీయం' ఏంటో ఈజీగానే అర్థమయిపోతుంటుంది. విశాల్, రాహుల్‌గాంధీకి శుభాకాంక్షలు చెబుతూ, అందులో ఖుష్బూ పేరు కూడా ప్రస్తావించాడు. ఖుష్బూ సినీ నటి, పైగా విశాల్‌కి అత్యంత సన్నిహితురాలు. అంతేనా, ఆమె కాంగ్రెస్ నేత కూడా.
ఇక, తమిళనాడులో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో విశాల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడనీ, ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి విశాల్ ప్రయత్నించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఇదేననీ గుసగుసలు గుప్పుమంటున్నాయి. విశాల్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడన్న ప్రచారం ఆటోమేటిక్‌గా జరిగిపోతోందనుకోండి.. అది వేరే విషయం.
ఇంతకీ, ఈ తాజా ప్రచారంపై విశాల్ ఏమంటాడో.! ఏ రాజకీయ ఉద్దేశ్యాలూ లేకుండానే ఆయన రాహుల్‌గాంధీకి 'శుభాకాంక్షలు' తెలిపాడని అనుకోగలమా.?