డబ్బు సంపాదించాలి. సంపాదించాక వ్యాపారాలు పెట్టాలి. వ్యాపారాలు కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వెళ్లాలి. రాజకీయం కోసం మీడియా రంగంలోకి రావాలి. అప్పుడు చూడండి, నా సామిరంగా.. ఎవడొస్తాడు మన జోలికి? ఏమైనా అంటే మీడియాపై దాడి అని హంగామా చేయచ్చు. నువ్వు చేస్తున్న వ్యాపారం గురించి అడిగితే మీడియాపై దాడి అంటావేంటీ? అని అడిగేవాడు వుండడు. ఇదంతా కూడా పాత ఫ్యాషన్ నే.
ఇప్పుడు కొత్త ఫ్యాషన్ పుట్టుకువచ్చింది. రాజకీయ నాయకుల వ్యాపారాల లెక్కలు అడిగితే, అదిగో రాజకీయ కక్షకు నిదర్శనం అంటున్నారు. అంటే ఇక మిగిలింది ఎవరు? జస్ట్ కామన్ మ్యాన్. ఈ క్యామన్ మ్యాన్ పై దాడికి ఎవ్వరినీ అడగక్కరలేదు. దాడికి వచ్చే అధికారులకు బందోబస్త్ అవసరంలేదు. అయ్యో, పైసా పైసా కూడబెట్టి సంపాదించిన వాడిని ఎందుకు అలా సతాయిస్తారు అని అడిగేవాడు కూడా వుండడు.
మీడియాను వదిలేయండి. రాజకీయ నాయకుల జోలికి వెళ్లకండి. సామాన్యుడి ముక్కుపిండి వసూళ్లు చేయండి. ఇదేనా ఇప్పుడు అధికారంలో వున్న చంద్రబాబు చెప్పేది? రాజకీయ నాయకులు, బడా బాబుల జోలికి వెళ్తామంటే మీకు సెక్యూరిటీ ఈ ప్రభుత్వం ఇవ్వదు. ఆపైన ఏం జరిగినా మీదే బాధ్యత. ఇదేనా చంద్రబాబు చెప్పేది?
ఏం జరుగుతోంది ఇక్కడ? ఓ ముఖ్యమంత్రి ఇలాగేనా రియాక్ట్ అయ్యేది? రాష్ట్రంలో నలధనం వెలికి తీయాలని అనుకుంటే కేంద్రం తన బలగాలను తాను తెచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా నిర్ణయం తీసుకుని, చంద్రబాబు జనాలకు ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
అసలు నల్లధనం ఎక్కడ పేరుకుంటుంది? ఉద్యోగులకు ప్రతి రూపాయి అధికారికంగా వస్తుంది. కానీ వ్యాపారులకు, రాజకీయ నాయకులకు అలా కాదు. మరి వాళ్ల మీద దాడి చేయవద్దంటే, నల్లధనం వెలికి తీయవద్దు అనేనా బాబుగారు చెప్పదలుచుకున్నది? మరి నోట్లరద్దు తన ఘనతే అని చెప్పుకుంటారు? మళ్లీ ఇప్పుడు ఇలా ఆయనే అంటారు? ఏమిటో బాబుగారి మాటలేకాదు, చేతలు కూడా అర్థంకావు.