ఎన్టీఆర్ బయోపిక్ రోజుకో రకమైన కొత్త ముస్తాబుతో వార్తల్లో వుంటోంది. తేజ దర్శకత్వంలో మొదలైన సినిమా క్రిష్ చేతికి వచ్చింది. అతని రాకతో ప్రాజెక్ట్ కళ మారిపోయింది. కాస్టింగ్ దగ్గర్నుంచి ప్రమోషన్ వరకు క్రిష్ ముద్ర బాగా కనిపిస్తోంది. ఇంతవరకు ఓకే కానీ సడన్‌గా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది.
పైగా ఆ రెండు భాగాలని రెండు వారాల వ్యవధిలో విడుదల చేస్తామని చెప్పడం మరింత సర్‌ప్రైజ్ చేసింది. 'ఎన్టీఆర్' జీవిత కథని రెండు భాగాలుగా చెప్పడం మంచి ఆలోచనేనా? మొదటి భాగం 'సినిమా జీవితం', రెండవ భాగం 'రాజకీయ ప్రస్థానం' అని అర్థమవుతోంది. అయితే కేవలం సినిమా షూటింగులు, ఆ విశేషాలతో మొదటి భాగం ఆకట్టుకోగలదా?
రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ఒడిదుడుకులని చూపించే విషయంలో మేకర్స్‌కి నిబద్ధత వుందా? నిజంగా ఎన్టీఆర్ జీవితంలోని చివరి అధ్యాయాన్ని అంతే నిజాయితీగా చూపిస్తారా? బాలకృష్ణ, నారా చంద్రబాబునాయుడి అదుపాజ్ఞల్లో రూపొందుతోన్న ఈ చిత్రం వాస్తవానికి అద్దం పడుతుందనేది అమాయకత్వమే అవుతుంది.
రెండు భాగాలుగా విభజించేంత కథ, డ్రామా ఎన్టీఆర్ జీవితంలో ఏముంది? నిజంగా అంత వుందంటారా… లేక ఈ ప్రాజెక్ట్‌పై వున్న ఆసక్తిని క్యాష్ చేసుకునే ప్రయత్నమే అనుకోవాలా? ఈ సినిమాలు విడుదలైతే తప్ప నిజంగా ఎంత మేటర్ వుందనేది బయటపడదు.