సందీప్ కిషన్ ఫ్లాపుల జాబితా ఈపాటికే డజను దాటిపోయింది. తమిళ చిత్రాలని కూడా కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువవుతుంది. అప్పట్లో 'ఇతని సినిమా చూడవచ్చు' అనిపించుకున్నవాడే ఇప్పుడు 'ఇతని సినిమా చూడక్కర్లేదు' అనే పొజిషన్‌కి వచ్చాడు. తన సినిమాలో కంటెంట్ ట్రెండీగా వున్నా, స్టార్ హీరోయిన్ వున్నా కానీ పోస్టర్ ఖర్చులు కూడా రావడంలేదు.
సందీప్ గత చిత్రం పేరు ఎలాగయితే చాలా మందికి గుర్తుండదో, నెక్స్‌ట్ ఏంటి కూడా కొన్నాళ్లకి అలా గుర్తు లేకుండా పోతుంది. బాక్సాఫీస్ వద్ద అత్యంత దారుణంగా ఫెయిలైన ఈ చిత్రంతో ప్రేక్షకులకి సందీప్‌పై అస్సలు నమ్మకం లేదనే సంగతి బయటపడింది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే అల్లాటప్పా సినిమాలతో జరిగే పని కాదు. అద్భుతం అనే టాక్ తెచ్చుకుంటే తప్ప అతని సినిమా కోసం జనం కదలరు.
తక్కువ బడ్జెట్ సినిమాలే కదా, 'ఈమాత్రం చాలు' అనే ఆటిట్యూడ్ పక్కన పెట్టి, 'ఈ సినిమా తప్పక చూడాలి' అనే భావన, నమ్మకం కలిగించడం మీద దృష్టి పెట్టాలి. ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా బౌన్స్‌బ్యాక్ అయిన హీరోలున్నారు. కనుక ఇప్పటికీ మించిపోయినది ఏమీ లేదు. కాకపోతే వేయబోయే మలి అడుగు మాత్రం ఆచి తూచి వేయక తప్పదు.