సింగం 3 సినిమా తెలుగు హక్కులు ఏ ముహుర్తాన సెట్ అయ్యాయో కానీ, అన్నీ వాయిదాలే. ఈ సినిమాను 15 నుంచి 20 కోట్ల భారీ మొత్తానికి తెలుగు నిర్మాత శివకుమార్ తీసుకున్నారు. ఇందుకోసం పాపం, ఆయన ఓ సీమ పొలిటీషియన్ సంస్థలో ఆరు కోట్ల వరకు ఫైనాన్స్ కూడా తీసుకున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి. కానీ సినిమా ఎప్పుడు వస్తుందీ అన్నదే తెలియడం లేదు. సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన బజ్ అంతా
చెట్టెక్కేసింది. 23న వస్తుంది అనుకుంటే మళ్లీ వాయిదా అన్నారు. దాంతో సింగం సినిమాను వివిధ ఏరియాలకు కొన్న బయ్యర్లు తెలుగు నిర్మాతపై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. వడ్డీలు నష్టపోతున్నామని, తమకు సినిమా వద్దు అని అడ్వాన్స్ లు ఇచ్చేమని వారు అడుగుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.
బయ్యర్లు ఇలా అంటే నిర్మాత మాత్రం ఏం చేస్తారు. ఆయన కూడా తమిళ వెర్షన్ నిర్మాతను అదే అడగాలి. అప్పుడు జ్ఞాన్ వేల్ రాజానే నేరుగా తెలుగులో విడుదల చేసుకోవాలి. భారీ డబ్బింగ్ సినిమాలతో ఇలా సమస్య కామన్ అయిపోయింది. ఆ మధ్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాకు తెలుగు నిర్మాత 20 కోట్లు పెట్టి, వడ్డీలు కట్టుకుంటూ కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ఆఖరికి సినిమా విడదులయినా పెద్దగా ఫలితం లేకపోయింది.