దర్శకరత్న దాసరి నారాయణరావు పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా నిర్మించనున్నట్లు ప్రకటించారు. తన సినిమా హీరోని పొగడటానికి ఇంకో హీరో సినిమా ఫంక్షన్‌ని వాడుకున్నారాయన. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దాసరి దిట్ట. ‘పెద్దరికం’ ఉంది కనుక, దాసరి ఏమైనా మాట్లాడతారు. నచ్చినవారు ఔననీ, నచ్చనివారు నాన్సెన్స్ అనీ అంటారు.
ఎన్టీఆర్, అక్కినేని తర్వాత స్టైల్ ఐకాన్ పవన్‌కళ్యాణ్ అని దాసరి అన్నారు. మధ్యలో ఎందరు హీరోలు లేరు? సూపర్ స్టార్ కృష్ణ, అందాల నటుడు శోభన్‌బాబు, ఈ జనరేషన్ సూపర్ స్టార్ మహేష్ కూడా స్టైల్ ఐకాన్. చిరంజీవి కన్నా స్టైల్ ఐకాన్ ఇంకెవరు? అని ప్రశ్నిస్తారు సినీ రంగంలో ఉన్నవారు, సినిమా రంగం గురించి తెలిసినవారు. రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య చెడ్డదనే అర్థం. దాసరి వ్యాఖ్యలు కూడా చిరంజీవి అభిమానుల్ని అందుకే హర్ట్ చేశాయి.
పవన్‌కళ్యాణ్ సినిమాకి దాసరి నిర్మాత అయితే, చరణ్ సినిమాకి తానే నిర్మాతనని పవన్‌కళ్యాణ్ ప్రకటించాడు. అన్నయ్యని కాదనే మనస్తత్వం పవన్‌కళ్యాణ్‌కి లేదు. అన్నయ్య నీడలోనే తామంతా హీరోలుగా ఎదిగాం అని పవన్ కూడా చెబుతాడు. దాసరికి కూడా ఇది తెలుసు. తాను మాట విసిరి, పది మందితో తిట్టించుకోవడం దాసరి లాంటి ప్రముఖులకు గౌరవం కాదు. చిరంజీవిపై ప్రేమతో ‘నోరు అదుపులో పెట్టుకో’ అని అతని అభిమానులు హెచ్చరించారు అనంటే, దాసరి తాను మాట్లాడినదానికి చింతించవలసిందే.