ఈ రోజుల్లో తమ సినిమాను ఫలానా హిందీ ప్రొడ్యూసర్ రీమేక్ చేయబోతున్నాడు.. అని చెప్పుకోవడం తెలుగు సినిమా వాళ్లకు రొటీన్ అయ్యింది. తమ సినిమా ఇంకా మేకింగ్ దశలో ఉండగానే వేరే పరిశ్రమల వాళ్లు రీమేక్ రైట్స్ అడిగారని అంటూ కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. ఈ పరంపరలోనే 'డియర్ కామ్రేడ్' కూడా నిలిచింది. అయితే ఈ సినిమా విషయంలో స్వయంగా బాలీవుడ్ ప్రొడ్యూసరే ఈ ప్రకటన చేశారు. అది కూడా ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ తను 'డియర్ కామ్రేడ్' ను రీమేక్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు.
ఈ సినిమా సౌత్ వెర్షన్ల విడుదలకు ముందే ఆ ప్రకటన చేశాడు కరణ్. అందుకు సంబంధించి మరో అప్ డేట్ కూడా వచ్చింది. దాదాపు ఆరుకోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించి కరణ్ 'డియర్ కామ్రేడ్' రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడని బాలీవుడ్ మీడియా చెబుతూ ఉంది. ఆరు కోట్ల రూపాయల మొత్తానికి రీమేక్ రైట్స్ అంటే ఫర్వాలేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతం దేవరకొండ సినిమాలకు ఉన్న క్రేజ్ ను బట్టి చూసినా.. హిందీ డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో ఆ మాత్రం సొమ్ములు సంపాదించుకోవచ్చు.
రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుని ఉంటే అవన్నీ కరణ్ జొహార్ కే సొంతం అయి ఉంటాయి. ఒకవేళ ఈ సినిమాను రీమేక్ చేయకుండా.. డబ్బింగ్ చేసి వదిలినా, డిజిటల్, శాటిలైట్ ద్వారా కరణ్ ఆ మొత్తాన్ని చాలా సులభంగా రాబట్టుకోగలడు. రీమేక్ చేయకుండా డబ్బింగ్ అయితే కరణ్ సేఫ్ జోన్లో ఉన్నట్టేనేమో!