సాయిధరమ్ తేజ్, సుమంత్, అఖిల్, నాగశౌర్య, అల్లు శిరీష్.. ఇలా ఈ హీరోలందరికీ ఈ నెలలో ఒకటే టెన్షన్. ఎందుకంటే కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వీళ్లది. వీళ్లు నటించిన సినిమాలన్నీ ఈ నెలలోనే థియేటర్లలోకి వస్తున్నాయి.
జవాన్ గా ఈరోజే థియేటర్లలోకి వచ్చాడు సాయిధరమ్ తేజ్. వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ హీరో జవాన్ తో ఎలాగైనా కోలుకొని మళ్లీ పట్టాలపైకి రావాలనుకుంటున్నాడు. ఈ సినిమా హిట్ అయితేనే తేజూ నెక్ట్స్ మూవీస్ పై కాస్త క్రేజ్ ఉంటుంది. లేదంటే అతడి కెరీర్ గ్రాఫ్ మరింత పడిపోవడం ఖాయం. జవాన్ జాతకం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
డిసెంబర్ టెన్షన్ సుమంత్ లో కూడా ఉంది. హిట్స్ లేక పూర్తిగా సినిమాలు తగ్గించేశాడు ఈ హీరో. గతేడాది చేసిన నరుడా డోనరుడా, మూడేళ్ల కిందట చేసిన మరో 2 సినిమాలు… ఇలా ఏవీ సక్సెస్ కాలేదు. ఇంకా చెప్పాలంటే ఈ హీరో హిట్ కొట్టి చాలా ఏళ్లయింది. ఇలాంటి టైమ్ లో సుమంత్ చేసిన సినిమా 'మళ్లీ రావా'. డిసెంబర్ 8న విడుదలకానున్న ఈ సినిమాపై సుమంత్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
సాయిధరమ్ తేజ్, సుమంత్ కంటే ఎక్కువ టెన్షన్ పడుతున్న హీరో అఖిల్. నిజానికి ఈ హీరోపై ఉన్నంత ఫోకస్ ఇప్పుడు మరే హీరోపై లేదు. మొదటి సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఈ అక్కినేని హీరో, లాంగ్ గ్యాప్ తర్వాత “హలో” చెబుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో చిత్రం డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తోంది.
అఖిల్ కు ఈ సినిమా సక్సెస్ అత్యవసరం. లేదంటే కెరీర్ లో మళ్లీ గ్యాప్ తప్పదు. చిన్నకొడుక్కి ఎలాగైనా హిట్ ఇవ్వాలనే కసితో నాగార్జున ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాడు.
ఈమధ్య కాలంలో సరైన విజయాలు అందుకోలేకపోయిన నాగశౌర్య, శ్రీరస్తు-శుభమస్తు సక్సెస్ ను కొనసాగించాలనే కసితో ఉన్న అల్లు శిరీష్ కూడా ఈ నెలలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నాగశౌర్య నటించిన ఛలో సినిమా డిసెంబర్ 29న, అల్లు శిరీష్ చేసిన ఒక్క క్షణం సినిమా డిసెంబర్ 23న థియేటర్లలోకి వస్తున్నాయి. వీళ్లతో పాటు వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న సునీల్ కూడా '2 కంట్రీస్' మూవీతో డిసెంబర్ లోనే లక్ చెక్ చేసుకోబోతున్నాడు.
వీళ్లతో పాటు ఈ నెలలో థియేటర్లలోకి వస్తున్న నాని ఒక్కడే ప్రస్తుతానికి సేఫ్ పొజిషన్ లో ఉన్నాడు. వరుస హిట్స్ తో ఊపుమీదున్న ఈ హీరో.. తన ఎంసీఏ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నాడు.