రామ్-లీల, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ సినిమాలతో దీపిక స్టార్ డమ్ ను పతాక స్థాయికి తీసుకెళ్లిన దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి ఇప్పుడు పెద్ద షాక్ నే ఇచ్చిందట ఆ నటీమణి. తన తదుపరి సినిమా కోసం దీపికనే నమ్ముకున్న భన్సాలీకి ఆమెతో పారితోషికం విషయంలో విబేధాలు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది.
ప్రత్యేకించి హీరోతో సరిసమానమైన పారితోషికం కావాలనే డిమాండ్ తో దీపిక భన్సాలీ తదుపరి సినిమా నుంచి వైదొలిగినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇంతకీ ఆ సినిమాలో హీరో ఎవరో కాదు.. స్వయంగా దీపిక భర్త రణ్ వీర్ సింగ్ కావడం గమనార్హం!
స్త్రీ-పురుషులు సమానమే అన్నట్టుగా, రెమ్యూనిరేషన్ విషయంలో కూడా సమానత్వం వర్తిస్తుందని దీపిక వాదనగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమె చాలా సినిమాల్లో మేల్ ఆర్టిస్టుల కన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అమితాబ్ బచ్చన్ తో ఒక సినిమాలో చేసిన దీపిక అందులో ఆయన కన్నా ఎక్కువ పారితోషికం తీసుకుందట.
అలాగే పద్మావత్ లో అందులోని ఇద్దరు ప్రధాన పాత్రధారులు అయిన మేల్ ఆర్టిస్టుల కన్నా దీపిక పారితోషికమే ఎక్కువనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రణ్ వీర్ సింగ్ కూడా రెమ్యూనిరేషన్ పెంచేశాడట.
ఈ నేపథ్యంలో.. రణ్ వీర్- దీపికల జంటతో కొత్త సినిమాను ప్లాన్ చేసిన భన్సాలీకి దీపికతో రెమ్యూనిరేషన్ విషయంలో విబేధాలు వచ్చాయట. రణ్ వీర్ కు ఎంత ఇస్తుంటే తనకూ అంతే ఇవ్వాలని, ఒక రూపాయి కూడా ఎక్కువ అవసరం లేదని, అలాగే ఒక రూపాయి తక్కువైనా ఒప్పుకునేది లేదని దీపిక స్పష్టం చేసిందట.
అయితే భన్సాలీ ఏమనుకున్నాడో ఏమో కానీ.. దీపిక డిమాండ్లకు తలొగ్గలేదని, దీంతో ఈ కాంబోలోని కొత్త సినిమా నుంచి ఆమె వైదొలిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే గొడవ పారితోషికం విషయంలో కాదని, తన మెంటల్ హెల్త్ కోసం విశ్రాంతి తీసుకోవడానికే దీపిక మరో భారీ సినిమా నుంచి బయటకు వచ్చిందనే మాటా వినిపిస్తుండటం గమనార్హం.