ఎవరైనా గర్వించదగిన స్థాయి విజయం సాధిస్తే.. దాన్ని క్యాష్ చేసుకుంటూ తాము ఉచిత ప్రచారం పొందే ఎత్తులను అనేక మంది వేస్తూ ఉంటారు. ఒలింపిక్స్ ఈవెంట్స్ లో భారతీయ ఆటగాళ్ల విజయాలను ఇలానే కొన్ని కార్పొరేట్ కంపెనీలు వాడుకున్నాయి. ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన ఆటగాళ్లకు శుభాకాంక్షలు చెప్పే నెపంతో తమ లోగోలు- వాళ్ల ఫొటోలు కలిపి ఉన్న పోస్టులు పెట్టడం, అలాగే వాళ్లకు తామేదో పావలా అర్ధ బహుమానాలను ప్రకటించడం.. వంటి చర్యలతో వీరు ప్రచారం పొందుతూ ఉంటారు.
అందుకు ఉదాహరణల్లో ఒకటీ.. మీరా ఛానూ రజత పతకం సాధించగానే ఒక పిజ్జా కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆమెకు జీవితాంతం పిజ్జాను తాము ఉచితంగా సర్వ్ చేస్తామంటూ ప్రకటించుకుంది. అయితే.. ఆ ఆఫర్ ను మీరా అడిగిందా? ఆమె ఆ ఆఫర్ ను ఉపయోగించుకుంటుందా? అనే వాటితో ఇక్కడ ప్రమేయం లేదు. ఆ అనౌన్స్ మెంట్ ద్వారానే ఆ పిజ్జా మేకర్ బోలెడంత ప్రచారాన్ని పొందింది! పూర్తి ఉచితంగా. అదే మీరాను తమ పిజ్జాకు బ్రాండ్ అంబాసిడర్ చేసుకోవాలంటే ఆ సంస్థ భారీగా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మాత్రం తను ఉచితంగా పిజ్జాను ఆఫర్ చేస్తున్ననట్టుగా ప్రకటించి, జనాల్లో సింపతీని పొంది, ఫ్రీ పబ్లిసిటీ పొందుతోంది.
ఆ పిజ్జా కంపెనీకి ఒక అవకాశం దక్కింది. వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ ముగిసిన తర్వాత చాన్నాళ్లకు మీరా ఒక పిజ్జా తినడంతో.. ఆ సంస్థ వెంటనే మేల్కొని క్యాష్ చేసుకుంది. అయితే ఈ విషయంలో మీరా ఇంకా స్పందించలేదు.
అయితే.. రెండో ఒలింపిక్ మెడల్ గెలిచిన తర్వాత.. పీవీ సింధూ ఫొటోను కూడా పలు కార్పొరేట్ కంపెనీలు ఇలాగే వాడుకున్నాయి. తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పీవీ సింధూ పేరును, మెడల్ తో ఆమె ఉన్న ఫొటోలను పోస్టు చేస్తూ, పనిలో పనిగా తమ కంపెనీల లోగోలను పెట్టేశాయి. సాధారణంగా ఎవరైనా అథ్లెట్లకు స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్న వారు ఇలాంటి పోస్టులు పెడితే అదో అందం.
అయితే సింధూతో ఎలాంటి ఒప్పందాలూ లేని సంస్థలన్నీ.. ఇప్పుడు మెడల్ తో ఉన్న ఆమె ఫొటోను వాడేసుకున్నాయి. శుభాకాంక్షలు చెప్పే నెపంతో, లోగోలను వాడుకుంటూ.. జనాల్లోని భావోద్వేగాన్ని క్యాష్ చేసుకునే తెలివైన పని చేశాయి. సింధూ పతాకం సాధించినందుకు తాము ఆనందిస్తున్నట్టుగా పలు కార్పొరేట్ కంపెనీలు ఆ పని చేశాయి. ఈ జాబితాలో పెద్ద పెద్ద కంపెనీలున్నాయి.
అపోలో హాస్పిటల్స్, కొన్ని బ్యాంకులు.. ఇలాంటి వాటన్నింటికీ పీవీ సింధూ తరఫు నుంచి లీగల్ నోటీసులు వెళ్లినట్టుగా సమాచారం. ఒలింపిక్స్ లో ఆమె రెండో పతకం సాధించడాన్ని అదునుగా తీసుకుని, తనేదో వారి బ్రాండ్లకు అంబాసిడర్ అయినట్టుగా ఫొటోలను పోస్టు చేయడంపై ఆమె చట్టపరమైన చర్యలకు ఉపక్రమించిందట.
దీనికి పరిహారంగా ఒక్కోరు ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని తనకు చెల్లించాలని సింధూ తరఫు నోటీసుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కార్పొరేట్లు ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరించాయి. ఆమెకు శుభాకాంక్షలు అంటూ.. జనాల్లో ఉన్న భావోద్వేగ మూడ్ కు చేరువయ్యే ప్రయత్నం చేశాయి. మరి లీగల్ సింధూ పిటిషన్లపై తెలివి మీరిన కార్పొరేట్ కంపెనీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తిదాయకమైన అంశం.
అయితే కొందరు కార్పొరేట్లు మాత్రం.. చాలా హుందాగా వ్యవహరిస్తుంటారు. అందుకు ఉదాహరణ ఆనంద్ మహీంద్రా. ఇండియా తరఫున క్రీడల్లో మంచి ప్రదర్శన నమోదు చేసిన వారందరికీ ఆయన తన కంపెనీ కార్లను బహుమానంగా ప్రకటిస్తూ ఉంటాడు. ఆ మధ్య ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో టెస్టుల్లో సత్తా చూపించిన.. యువ ఆటగాళ్లకు వరస పెట్టి మహీంద్రా ఎక్స్యూఈవీలను బహుమతులుగా ప్రకటించారు.
ఐదారు మంది క్రికెటర్లకు అప్పుడు ఆ బహుమతులు దక్కాయి. వారు కూడా ఆనందంగా వాటిని స్వీకరించారు. అలాగే ఇప్పుడు నీరజ్ చోప్డా కు కూడా ఆనంద్ మహీంద్రా అలాంటి బహుమతే ప్రకటించాడు. ఇది ఎంత వరకూ వచ్చిందంటే.. సోషల్ మీడియాలో నెటిజన్లే ప్రతి సారీ మహీంద్రాను ఈ విషయం గురించి అడుగుతుంటారు. ప్రతిభతో వెలుగులోకి వచ్చిన వారి పేర్లను ప్రస్తావిస్తూ, వాళ్లకు ఉచితంగా కార్లను ఇవ్వమని ఆయన ఫాలోయర్లే పోస్టులు పెడుతూ ఆయనను ట్యాగ్ చేస్తూ ఉంటారు.