‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై ప్రస్తుత ‘మా’ ఉపాధ్యక్షురాలు, నటి హేమ తోటి నటీనటులకు పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీ వుడ్‌లో కాకరేపుతోంది. హేమ వాయిస్ మెసేజ్‌పై ‘మా’ అధ్యక్షుడు నరేష్, జనరల్ సెక్రటరీ జీవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హేమ చేసింది ముమ్మాటికీ తప్పేనని వారు తేల్చి చెప్పారు. అంతేకాదు, హేమపై చర్చ తీసుకోవాలని క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్టు నరేష్ ప్రకటించారు. అసలు వివాదానికి కారణమైన హేమ మాటలేంటో తెలుసుకుందాం.
‘ ఇంత వరకు ‘మా’ అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించింది లేదు కానీ.. నరేష్ గారు మొత్తం ఉన్న రూ. 5కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టేశారు. పోయినసారి మెడికల్ క్లైమ్‌కి, రాబోయే మెడికల్ క్లైమ్‌కి కలిపి మొత్తం రెండున్నర కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క. ఆఫీస్ ఖర్చులు అవీ, ఇవీ కలిపి దాదాపు అంతే అవుతుంది. ఇది వరకు ఏంటంటే.. ఆఫీస్ ఖర్చులు బయటి నుంచి తీసుకువచ్చి, మేము ఫండ్ రేజ్ చేసి ఇచ్చే వాళ్లం. ఇప్పుడాయన హాయిగా కూర్చుని మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడాయన ఆ కుర్చీ దిగకూడదు… ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు’ అని హేమ చేసిన ఘాటు వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై నరేష్, జీవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మా’ ను కించపరిచేలా ఎలా మాట్లాడ్తారని నరేష్ ప్రశ్నించారు. నరేష్ మాట్లాడుతూ… ‘ ఇది క్రమశిక్షణ చర్యకు దారి తీస్తుంది. ఎందుకంటే ‘మా’ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారు. ‘మా’ సభ్యుల్లో సందేహాలను సృష్టించి, కరోనా సమయంలో ఎన్నికల కోసం పాకులాడడం ఏంటి? తాము సీట్లో కూర్చోవాలని ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడాన్ని మేము ఖండిస్తున్నాం.
మేము స్పష్టంగా వాస్తవాలను దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నాం. గత రెండు రోజుల పరిణామాల నేపథ్యంలో ‘మా’ డిస్ట్రబ్ కావడాన్ని దృష్టిలో పెట్టుకుని క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాం. క్రమశిక్షణ సంఘం నిర్ణయానికే వదిలేస్తాం. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా …మా ఆమోదాన్ని తెలుపుతాం’ అని ఆయన చెప్పుకొచ్చారు.
జీవితా రాజశేఖర్ స్పందిస్తూ… ‘ హేమ గారు చెప్పిన ఈ మాటలన్నీ చాలా తప్పుగా అనిపించాయి. ఎందుకంటే ఒక అవగాహనతోనే అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికలు పెట్టాలని ఎవరు అడుగుతున్నారు? ‘మా’ సభ్యుల్లో కన్ఫ్యూజన్ సృష్టించడం దేనికి? ‘మా’ సభ్యుల్ని ఎలా నడిపిస్తున్నాం(హేమకు ప్రశ్న)?. మన కోసం ఎవరు పని చేస్తారో మెంబర్స్‌ని ఆలోచించుకుని ఓటు వేసేందుకు సహకరించాలి.
మనం ఎందుకు ఇలాంటి గందరగోళాన్ని సృష్టించడం. మన అసోసియేషన్‌లో ఫండ్ ఎందుకుంది? మెంబర్స్ చచ్చిపోతుంటే ఫండ్‌ని ముట్టుకోమని చెప్పాలా? మెంబర్స్‌ని చచ్చిపోనిస్తామా? మెంబర్స్‌కే కదా ఉపయోగపడింది ఈ సొమ్మంతా?. ఏమన్నా నేను మా ఇంట్లో పెళ్లి చేసుకున్నానా? లేదంటే నరేష్ వెళ్లి పార్టీలు పెట్టుకున్నాడా?’ అని హేమపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీళ్ల స్పందనపై హేమ రియాక్షన్ ఏంటనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలతో ‘మా’లో వివాదం రోజురోజుకూ ముదురుతోందనే అభిప్రాయాలు టాలీవుడ్‌లో వ్యక్తమవుతున్నాయి.