పార్లమెంట్ సమావేశాలు ఏ ముహూర్తాన ప్రారంభమయ్యాయో కానీ, రోజూ వాయిదాలతోనే సరిపోతోంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్న పెగాసస్ సహా పలు సమస్యలపై పార్లమెంట్ ఉభ సభలను ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క విషయంలో మోడీ సర్కార్‌కు సహకరిస్తామని ప్రతిపక్షాలు హామీ ఇవ్వడం గమనార్హం. దీంతో కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ప్రతిపక్షాల మద్దతు పొందిన ఆ ఒక్కటి…ఓబీసీ బిల్లు.
రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు విపక్షాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ బిల్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రకటించడం విశేషం. ఇది చాలా కీలకమైన బిల్లు అని, అందువల్లే కేంద్రానికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు విపక్ష నేతలు స్పష్టం చేశారు.
ఈ బిల్లు ఏ రకంగా ముఖ్యమైందో ప్రతిపక్షాలు వివరించాయి. ఈ బిల్లు ఆమోదంతో ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారం ఇక మీదట రాష్ట్రాలకే దక్కుతుంది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం.
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో, అక్కడ రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొస్తోందనే అభిప్రాయాలున్నాయి. ఇదే సందర్భంలో బిల్లును అడ్డుకోవడం ద్వారా …ఓబీసీల వ్యతిరేకిగా తమను చిత్రీకరించి బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలను భగ్నం చేసేందుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రతిపక్షాలు చెబుతున్నాయి.