Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'దేశం' కాపుల లక్ష్యం ఏమిటి?

'దేశం' కాపుల లక్ష్యం ఏమిటి?

తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? ఎన్నికల అనంతరం పార్టీలోని కీలక కాపునేతలు ఎందుకు హడావుడి చేస్తున్నారు? అసలు వారు ఆశిస్తున్నదేమిటి? కేవలం ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఆత్మ పరిశీలన మాత్రమే అయితే కాదు. ఇంకేదో లక్ష్యం వుంది. అదేమిటి? అన్నదే ఇప్పడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా వుంది.

తెలుగుదేశం పార్టీ ఆది నుంచి బిసిల పక్షం వుంటూ వస్తోంది. అది అంగీకరించాల్సిన వాస్తవం. సాంప్రదాయ ఓటు బ్యాంక్ లు కాకుండా, తమకు అంటూ ఓటు బ్యాంక్ ను తయారుచేసుకోవడం మీదనే ఆది నుంచి చంద్రబాబు దృష్టిపెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగానే బిసి వెలమలు, యాదవులు, గౌడ్ లు తదితర కులాలను కీలకంగా చూసుకున్నారు. ఈ క్రమంలో కాపులను కాస్త తక్కువగానే చూసారు.

అయితే 2014లో అధికారం అందిన తరువాత కాపులను కూడా దగ్గరకు తీయడం ప్రారంభించారు. అప్పటి వరకు కాఫులను మరీ దూరం పెట్టలేదు కానీ, 2014 తరువాత మాత్రం కాస్త ప్రయారిటీ ఎక్కువ చేసారు. ఇదే వ్యూహం బెడిసికొట్టింది. కాపులను దగ్గరకు తీయడంచూసి, ఇతరత్రా అనేక కారణాల వల్ల బిసిలు పార్టీకి తొలిసారి చాలా ఎక్కువగా దూరం అయ్యారు.

అదే సమయంలో కాపులు పూర్తిగా దగ్గరయ్యారా అంటే అదీ లేదు. తుని సంఘటన ప్రభావం బాగా పడింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు బలంగా చీల్చేసారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పుట్టి మునిగిపోయింది. ఇప్పుడు కాపునేతలు సమావేశాలు, హడావుడి మొదలు పెట్టారు? ఎందుకోసం? పవన్ ను దగ్గరకు తీయాలన్న వత్తిడిని మెల్లగా ప్రారంభించారు? నిజానికి ఇది ఇప్పటి నుంచి అవసరమా? అసలు ఏం జరుగుతోంది?

ఇదంతా చూస్తుంటే కాపులు తెలుగుదేశం పార్టీపై ఆధిపత్యం సంపాదించాలన్న ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. బిసిలు వైకాపా వైపు వున్నారు కాబట్టి, ఇదే అదనుగా తీసుకుని, తెలుగుదేశంలో బిసిల ఫ్రాబల్యం తగ్గించి, కాపులకు పెద్దపీట వేసే దిశగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశంలో బిసి నాయకుల కారణంగానే పవన్ పార్టీకి దూరం అయ్యారని, అందుకే ఇఫ్పటి నుంచే పావులు కదిపి, పవన్ ను మళ్లీ పార్టీకి దగ్గర చేయడం, పార్టీలో కాపులకు ప్రాధాన్యత పెంచి, బిసిల ఫ్రాబల్యాన్ని తగ్గించడం వంటి ఆలోచనలు ఈ కాపుల కూటమి చేస్తున్నట్లు కనిపిస్తోంది.

కానీ చంద్రబాబు తొందరపడే మనిషికాదు. ఆయన బిసిల బంధం చాలా గట్టింది. ముఖ్యంగా కోస్తా వెలమలు, యాదవులు, ఇతరత్రా జనాలకను ఆయన అంత సులువుగా దూరం చేసుకోరు. అందుకే కాపులు ఈ విధమైన వత్తిడి ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఈస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీలో బిసి నాయకులదే హవాగా వుంది. పదవుల సంగతి ఎలా వున్నా, పార్టీ పరంగా బిసి నాయకుల హవా ఎక్కువ. దీన్ని తగ్గించాలన్నదే కాపుల కూటమి ఆలోచనగా తెలుస్తోంది.

పవన్ ను తీసుకురావడం ద్వారా కాపుల పట్టు, తెలుగుదేశం పార్టీపై పెంచాలన్నది ఆ కూటమి గేమ్ ప్లాన్ గా కనిపిస్తోంది. కానీ పవన్ ఇప్పుడు ఎలా వుంటారో? నాలుగున్నరేళ్ల తరువాత ఎలా వుంటారో? అన్నది ఎవ్వరూ ఊహించలేరు. అందువల్ల ఇప్పటి నుంచి కాపులు హఢావుడి చేసినా ప్రయోజనం అంతగా వుండకపోవచ్చు.

టీడీపీ ఎమ్మెల్యే, రాజీనామాకూ రెడీ? జగన్ ఒప్పుకుంటాడా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?