ఏ చిన్న ట్రాన్సాక్షన్ అయినా సరే, డిజిటల్ రూపంలోనే చేయాలని ప్రధాని మోడీ చెబుతూ వస్తున్నారు. ఆ దిశగానే అన్ని విధాలా లాక్ చేసుకుంటూ వస్తున్నారు.
జనాలను ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం లకు అలవాటు చేసారు. నగదు లావాదేవీలు అన్నవి జరగకుండా ఎక్కడ ఎన్ని తాళాలు వేయాలో అన్నీ వేసుకుంటూ వస్తున్నారు. బ్యాంకుల దగ్గర అనేక కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇన్ కమ్ టాక్స్ వ్యవహారాల సంగతి సరేసరి.
ఇలాంటి నేపథ్యంలో ఓ ప్రజా ప్రతినిధి కోటిన్నర రూపాయలు నగదు రూపంలో లావాదేవీ చేయడం అంటే కాస్త ఆశ్చర్యకరమే. టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారు.
యాదాద్రి దేవుడి గుడి గోపురానికి బంగారు తాపడం చేసే కార్యక్రమం ఫ్రభుత్వం చేపట్టింది. దానికి విరాళాలు ఇవ్వాలని కోరింది. దానికి స్పందనగా మంత్రి మల్లారెడ్డి తన తరపున, తన నియోజక వర్గం తరపున మూడు కిలోల బంగారానికి సరిపడా విరాళం అందించారు.
అయితే ఈ విరాళాన్ని ఆయన నగదు రూపంలో చెల్లించడం విశేషం. డబ్బుల కట్టలను పళ్లాలలో పెట్టుకుని ఫ్రదర్శనగా హైదరాబాద్ నుంచి యాదగిరి వెళ్లి ఆయన అధికారులకు ఈ విరాళం అందించారు.
విరాళం ఇవ్వడం మంచి పనే. దేవుడికి ఇవ్వడం ఇంకా మంచి పనే. కానీ ఇంత పెద్ద మొత్తం నగదు రూపంలో ఇవ్వడం అంటే ప్రధాని చెబుతున్నదానికి, జరుగుతున్న దానికి విరుద్దంగా లేదూ?