విఐపి 2 సినిమా విడుదల డేట్ దగ్గరకు వస్తోంది. ఈ నెల 28న విడుదల. అయితే తెలుగు వెర్షన్ ను ఇప్పటి దాకా ఎవ్వరూ తీసుకోలేదు. అసలు ఎవరికైనా ఇవ్వాలన్న ఆలోచన కూడా తమిళ వెర్షన్ నిర్మాతలకు ఉన్నట్లు కనిపించడం లేదు.
ఎవరైనా ఫోన్ చేస్తే, చాలా ఉదాసీనంగా సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నయ్ రండి, మాట్లాడాలంటే, ఫోన్ లో కాదు. అని ఒక్క ముక్క చెప్పి పెట్టేస్తున్నారట. అసలు వాళ్లు ఏ రేంజ్ ఆలోచిస్తున్నారు, విషయం ఏమీ చెప్పడం లేదట.
నిజానికి ధనుష్ కు ఇంతో అంతో తెలుగు మార్కెట్ వుంది. అందునా విఐపి పార్ట్ వన్, రఘువరన్ గా తెలుగులో పెద్ద హిట్. దాంతో పార్ట్ 2కు భారీ రేట్లు ఆశిస్తున్నట్లు వినికిడి. అందుకే ఎవరు ఫోన్ చేసినా ఏమీ చెప్పకుండా చెన్నయ్ రమ్మని మాత్రం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పోనీ ఎవరన్నా వెళ్లి, ఎంతో కొంతకి కొందామన్నా, జస్ట్ పది రోజులే సమయం మిగిలింది. ఈలోగా పబ్లిసిటీ, అమ్మకాలు, థియేటర్లు అంటే కాస్త కష్టమే.
పైగా 28న రెండు పెద్ద సినిమాలు నక్షత్రం, గౌతమ్ నందా బరిలో వున్నాయి. మరి ధనుష్ తన సినిమాను నేరుగా విడుదల చేస్తారో? తమిళంలో హిట్ అయిన తరువాత మాంచి రేట్లకు తెలుగుకు అమ్ముతారో? చూడాలి. వెయిట్ అండ్ సీ.