‘‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్యం అప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్
ఏసత్ ధర్మ: సనాతన:’’
… అంటూ రామాయణంలో ఒక మంచి శ్లోకం ఉంది. ‘‘నిజం చెప్పాలి.. అవతలి వారికి ప్రీతికలిగే విధంగా చెప్పాలి. నిజమే అయినప్పటికీ అవతలి వారిని నొప్పించేలా చెప్పకూడదు. అంతమాత్రాన… అవతలి వారికి ప్రీతిగా ఉండడం కోసం అసత్యం అసలే చెప్పరాదు. సనాతన ధర్మం ఇదే’’ అని ఈ శ్లోకభావం.
పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో ఎక్కడెక్కడెక్కడినుంచో సాధుపుంగవులను రప్పించి వారికి కోట్లరూపాయలు సెలవుచేసి, పదుల ఎకరాలు స్థలాలు సంతర్పణ చేసి.. తన పార్టీ ఎమ్మెల్యేలకు తత్వబోధల స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేయించే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు ఈ ప్రాథమిక తత్వసారం అంతగా బోధపడినట్లు లేదు.
అందుకే నిజాన్ని నివేదించిన అధికారి మీద ఆయన నిప్పులు చెరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తనకు నచ్చని రీతిలో సంక్షేమ పథకాల అమలు గురించి సర్వే ఫలితాలను తీసుకువచ్చిన అధికారి మీద చంద్రబాబు ఆగ్రహం వెలిబుచ్చినట్లు తెలుస్తున్నది. పాలకులకు ఇలాంటి పైత్యం ఉంటే.. ఇక వాస్తవాలు తెలుసుకుని, తమ తప్పులు దిద్దుకుంటూ జనాన్ని మెప్పించే పాలన అందివ్వడం సాధ్యమేనా అనే ఆలోచన ప్రజల్లో మొదలవుతున్నది.
చంద్రబాబునాయుడు అసలే తాను పట్టిన కుందేలికి మూడేకాళ్లు అనే రకం. నిత్యం ఆయన చుట్టూ పోగయి ఉండే వందిమాగధ బృందం కూడా.. ఆయన చెప్పిన మాటలకు జైకొడుతూ చిడతలు వాయిస్తూ ఉంటారు. తాను తలచిందే సత్యం అనుకుంటూ ఆయన ఆ భ్రమల్లోనే మునిగి తేలుతుంటారు. అయితే వాస్తవాన్ని స్వీకరించడానికి ఇష్టపడకపోవడమే ఇక్కడ విచిత్రం.
చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వ పథకాల గురించి తానుగా కొన్ని సర్వేలు చేయించుకున్నారుట. సహజంగానే అవి పథకాలు అద్భుతం అనే ఫలితాలతో రూపొందాయి. అయితే మంగళవారం నాడు కేబినెట్ భేటీ సందర్భంగా ఓ శాఖకు చెందిన అధికారి చేయించిన సర్వేలో ఫలితాలు భిన్నంగా ఉండడంతో.. ఆయనకు కోపం వచ్చేసిందిట.
అయినా ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన అధికార్లను ఆదరించి.. తమ లోపాలను తెలుసుకుని దిద్దుకోవాలి గానీ.. ఇలా ఆగ్రహిస్తే.. ప్రతి ఒక్కరూ.. అధినేతకు నచ్చడం కోసం మెరమెచ్చు మాయమాటలు చెప్పి పొద్దుపుచ్చే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. దానివల్ల నష్టం వారి పార్టీకే గానీ.. మరొకరికి కాదని చంద్రబాబునాయుడు తెలుసుకోవాలి. ఈ ఘటన గురించి విన్నవారు మాత్రం.. నిజం చెబితే అంతే.. చంద్రబాబుకు ఉలుకెక్కువ అనుకుంటున్నారు.