ఏడాది గ్యాప్ తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ముహూర్తం షాట్ అయిన నెలరోజులకు మూవీ స్టార్ట్ చేశాడు. ఇక అంతా సాఫీగా సాగిపోతుందనుకునే టైమ్ లో చిన్న జర్క్. బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు మొదటి షెడ్యూల్ లోనే అభిప్రాయ బేధాలు వచ్చినట్టు తెలుస్తోంది.
కుటుంబ సమేతంగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కు వచ్చాడు బన్నీ. హైదరాబాద్ లో జరిగిన ఈ మొదటి షెడ్యూల్ లో బన్నీపై ఓ ఫైట్ సీక్వెన్స్ తీశారు. ఇక్కడ ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే ఇదే షెడ్యూల్ లో అదనంగా మరో 2 సన్నివేశాలు తీయాలని అనుకున్నారట. దీనికి బన్నీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలుస్తోంది.
అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే షూటింగ్ జరగాలని, ఎక్స్ ట్రా కాల్షీట్ ఒక్కటి కూడా ఇచ్చేదిలేదని తెగేసి చెప్పేశాడట. ఇక్కడితో అయిపోలేదు, నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడనే విషయాన్ని తనకు 2 వారాల ముందే చెప్పాలని కండిషన్ పెట్టాడట. నిజానికి త్రివిక్రమ్ విషయంలో బన్నీ ఇలాంటి కండిషన్లు, భేషజాలకు వెళ్లడు. కానీ ఈసారి మాత్రం అతడి వ్యవహారశైలి కాస్త తేడా కొడుతోంది.
దీనికి కారణం ఇది రెండు బ్యానర్లపై తెరకెక్కుతున్న సినిమా కావడమే. గీతాఆర్ట్స్, హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటి షెడ్యూల్ కు అల్లు అరవింద్ హాజరయ్యారు. కానీ తర్వాత షెడ్యూల్స్ కు మాత్రం నిర్మాణ పర్యవేక్షణను బన్నీకే అప్పగించారట అల్లు అరవింద్.
అలా కెమెరా ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో, కెమెరా వెనక తండ్రి దర్శకత్వంలో పనిచేస్తున్నాడట బన్నీ. హారిక-హాసిని నిర్మాతలతో చిన్న అభిప్రాయ బేధాలు రావడానికి ఇదేకారణం అంటున్నారు.