పాపం, సురేష్ బాబుకు అనుకోని సంఘటనతో దిగులు తప్పలేదు. ఆయన అత్యంత ఆసక్తితో తన స్వస్థలం చీరాలలో సురేష్ మహల్ థియేటర్ ను మొత్తం పునరుద్దరించారు. ఇదే కాదు, ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు థియేటర్లు రెడీ చేసారు.
సురేష్ మూవీస్ తరపున ఆయన ఇటీవల తన లీజు థియేటర్ల సంఖ్య గణనీయంగా పెంచుకునే వ్యూహంలో భాగంగా ఇవన్నీ బోలెడు ఖర్చు చేసి కొత్తగా తయారుచేసారు. ఈ థియేటర్లు అయిదూ రేపు కొత్తగా ప్రారంభం కానున్నాయి. ఈ అయిదు థియేటర్లలో కూడా నేనే రాజు-నేనే మంత్రి విడుదల అవుతుంది.
ఇలాంటి నేపథ్యంలో ఆయన అత్యంత శ్రద్ధ, ఆసక్తులతో తయారుచేసిన చీరాల సురేష్ మహల్ లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. మొత్తం చేసిన వర్క్ అంతా బూడదపాలైపోయింది. రెండు కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
సరే, ఇన్సూరెన్స్ వుందా లేదా అన్న సంగతి అలా వుంచితే, తమ స్వంత ఊరిలో, ఇష్టపడి, అందంగా తయారు చేసిన థియేటర్ ఓపెనింగ్ కు ముందు రోజు ఇలా జరగడం సురేష్ బాబును చాలా నిరాశకు గురిచేసింది. ఆ దిగులు, బాధతో కొంత సేపటి వరకు ఆయన ఎవరితోనూ టచ్ లో లేకుండా వుండిపోయారని వినికిడి.