పొగడ్తలకు పడని వాళ్లు వుంటారా? అబ్బే సమస్యే లేదు. అందులో సినిమా జనాలు అంటే వీర లెవెల్లో సూపర్ అంటే సూపర్ అని అనాలే కానీ, ఇట్టే పడిపోవడానికి రెడీగా వుంటారు. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడిప్పుడే ఒకటీ అరా సినిమాలు చేస్తున్న నందూకి కనీసం మూడు సినిమాలు గ్యారంటీ అనుకోవాలి.
ఎందుకంటే అతగాడు ఆ రేంజ్ లో ముగ్గురని పట్టుకుని గాల్లోకి ఎత్తేసాడు మరి. ఇదంతా ఈ ఉదయం జరిగిన జయ జానకీ నాయక యూనిట్ మీట్ సంగతే. ఈ మీట్ లో ఎవరి మాటలు ఎలా వున్నా, నందు మాత్రం ఓ అరగంట టైమ్ తీసుకున్నాడు తన ప్రసంగానికి. దర్శకుడు బోయపాటి గురించే పది నిమషాలు పైగా మాట్లాడాడు.
అసలు ఆయనేమిటి? ఆయన వర్కింగ్ స్టయిల్ ఏమిటి? అసలు ఆర్టిస్టులను పిండేయడం ఏమిటి? అబ్బో? ఓ రేంజ్ లో మాట్లాడాడు. కానీ మధ్య మధ్యలో తాను పొగడడం లేదని అన్నీ నిజాలే అని గుర్తు చేస్తూ వచ్చాడు.
అది అయిపోయిన తరువాత హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ను పట్టుకున్నాడు. అక్కడ ఓ పది నిమషాలు వేసుకున్నాడు. కానీ మళ్లీ అక్కడితో ఆగలా. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి స్టార్ట్ చేసాడు. ఆమె డిసిప్లిన్, వర్క్ హాలిక్ ఇతరత్రా వ్యవహారాలు చెప్పడానికి ఓ పది నిమషాలు తీసుకున్నాడు.
నందు మాటలు వింటూ ఆ ముగ్గురూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఆనందించారు. కచ్చితంగా బోయపాటి మరో సినిమా నందుకు ఇవ్వడం పక్కా అనుకోవాలి. పనిలో పని బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ తమ తరువాతి సినిమాలకు నందును రికమెండ్ చేసే అవకాశం వుంది.