సినీ నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ఆపద్బాంధవుడి అవతారమెత్తుతున్నాడట. ఈ విషయమై తెలుగు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన దిల్ రాజు, ఎప్పుడూ ‘తెలంగాణ’ ఫీలింగ్ చూపించలేదు. ఆ విషయం తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ తెలుసు. విభజన – సమైక్య ఉద్యమాల్లో ఏ సెగా తనకు తగలకుండా జాగ్రత్తపడ్డారాయన.
ఇప్పుడు తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో తెలుగు సినీ పరిశ్రమ ఎలా మనగలుగుతుందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అంతలోనే తెలంగాణ సర్కార్, అక్రమంగా భూముల్ని కొల్లగొట్టారంటూ కొందరు సినీ జనంపై కొరడా ఝుళిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ వివాదంలో ఇరుక్కున్న విషయం విదితమే. దీన్ని కూల్చేసే దిశగా అధికారులు ముందడుగు వేశారు.
అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా నాగార్జున హైకోర్టునూ ఆశ్రయించారు. కోర్టులో విషయం ఏమవుతుందోగానీ, ఈలోగా తెరవెనుక ప్రయత్నాలు షురూ అయ్యాయనీ, దిల్ రాజుని నాగార్జున రంగంలోకి దింపారనీ, ఆయన కేసీఆర్ వద్దకు వెళ్ళనున్నారనీ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇదెంతవరకు నిజమోగానీ, నిజమే అయితే.. దిల్ రాజు మధ్యవర్తిత్వం ఫలిస్తే.. తెలుగు సినీ పరిశ్రమకి దిల్ రాజు ఆపద్బాంధవుడవుతాడు.
ఇదొక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణ సర్కార్ వద్దకి దిల్ రాజుని మీడియేటర్‌గా పంపుతోందట. అంటే, తెలుగు సినీ పరిశ్రమని రెండుగా చీల్చాలనీ, ఒకటి ఆంధ్ర సినిమా.. ఇంకోటి తెలంగాణ సినిమాగా ఏర్పాటు చేయాలని.. కొన్ని వాదనలు రావడంతో ఆ విషయంలో ప్రభుత్వం, తెలంగాణ సినిమాకి మద్దతు పలకకుండా సినీ జనం దిల్ రాజుని అస్త్రంగా ప్రయోగించారన్నది గాసిప్స్ కాలమ్‌లో విన్పిస్తోన్న వార్త.
కేవలం ‘దిల్’ రాజు తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతోనే ఈ గాసిప్స్ వస్తున్నాయా.? లేదంటే, ఇవన్నీ నిజమేనా.? ఏమో మరి.!