నిన్న మొన్నటి వరకు సినిమాలు సెట్ చేసుకోవడంలో నిర్మాత దిల్ రాజుకు సాటి లేదు. మహేష్-వెంకటేష్ కాంబినేషన్ కానీ, మహేష్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నాని లాంటి హీరోలతో సినిమాలు కానీ అంతా అలా చకచకా జరిగిపోయింది. కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి. టాలీవుడ్ లోకి కొత్త నెత్తురు వస్తోంది. కొత్త పోటీలు వస్తున్నాయి. కొత్త రూల్స్ వస్తున్నాయి. వీటన్నింటి కారణంగా సినిమాలు సెట్టింగ్ అనేది కాస్త ఇబ్ఫందిగానే మారింది.
దిల్ రాజు ఇప్పుడు యంగ్ జనరేషన్ తో పోటీ పడాల్సి వస్తోంది. వాళ్లంత స్పీడుగా ఆయన నిర్ణయాలు తీసుకోలేరు. ఒక ప్రామిసింగ్ యంగ్ డైరక్టర్ కనిపిస్తే చాలు, ఈ యంగ్ జనరేషన్ అంతా చటుక్కున అడ్వాన్స్ లు చేతిలో పెట్టేస్తున్నారు. యంగ్ నిర్మాతలు ఇట్టే కబరు చేసి, అట్టే స్నేహం కలిపేసి, చటుక్కున ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నారు.
అదే దిల్ రాజు అయితే ఆలోచించి కానీ కబురు చేయలేరు. పైగా ఆయన సవాలక్ష పనులు. కబురు చేసిన తరువాత వాళ్లు వచ్చినా, అంత సలువుగా అడ్వాన్స్ లు జల్లేయలేరు. కానీ మైత్రీ మూవీస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, సాహు గారపాటి, ఇలా చాలా బ్యానర్లు చకచకా సినిమాలు ప్లాన్ చేస్తున్నాయి.
మరోపక్క పెద్ద హీరోలు, డైరక్టర్ల ట్రెండ్ మారిపోయింది. పెద్ద హీరోలు అందరికీ స్వంత బ్యానర్ లు వచ్చాయి. పారితోషికంతో పాటు, లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. అలాగే పెద్ద డైరక్టర్లు కూడా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలకు దిల్ రాజు అంత సుముఖం కాదు. దాంతో పెద్ద హీరోలతో సినిమాలు అన్నవి ఇకపై దిల్ రాజుకు కష్టం కావచ్చు. ఎన్నారైలు కొంతమంది టాలీవుడ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా ప్రామిసింగ్ డైరక్టర్లు దొరికితే చాలు అడ్వాన్స్ లు ఇవ్వాలని చూస్తున్నారు.
డైరక్టర్లు దగ్గర వుంటేనే హీరోల డేట్ లు అన్న టెక్నిక్ బాగా తెలిసింది. దాంతో ఇప్పుడు యంగ్ నిర్మాతలు అంతా డైరక్టర్లు బ్లాక్ చేస్తున్నారు. దిల్ రాజకు ప్రభాస్ తో సినిమా వుందనే కానీ అది ఎప్పటికి అయినా అవుతుందో, కాదో తెలియదు. దిల్ రాజు దగ్గర వున్న టాప్ డైరక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి మాత్రమే. లేదా వేణు శ్రీరామ్, నక్కిన త్రినాధరావు ఈ రేంజ్ డైరక్టర్లు. కొత్త కొత్త అయిడియాలతో ప్రూవ్ చేసుకున్నవారంతా వేరే వేరే నిర్మాతలకు కమిట్ అయిపోతున్నారు. ఇటీవలే జయంత్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేయాలని దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా చేయించాలని ఆయన ఆలోచనగా తెలుస్తోంది.
అప్పటికీ తెలివిగా ఆ మధ్య ఓ నిర్మాతల సిండికేట్ ను అట్టహాసంగా ప్రారంభించారు. ప్రాజెక్టు తెస్తే తాను ఫండింగ్ చేస్తా అని, రిలీజ్ తనదే అని ఓ స్కీము తయారుచేసారు. కానీ ఆ స్కీము ఆదిలోనే నీరుకారిపోయింది. ఆ నిర్మాతలంతా ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారు తప్ప ఇటు రాలేదు.
డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, విశాఖ, కృష్ణ, నైజాం చేతిలో వుంచుకోవడం, కొన్ని ఏరియాల్లో సిండికేట్ టై అప్ కావడం వల్ల దిల్ రాజకు కొంత అవకాశం కుదిరింది. కానీ ఇప్పుడు అది కూడా మెలమెల్లగా విడిపోతోంది. లక్షణ్ నైజాంలో పోటీగా మారుతున్నారు. ఆయన ఇప్పటికే నాని టక్ జగదీష్ తీసుకున్నారు. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా మీద ముందే కన్ను వేసారు. పండగకు విడుదలైన ఓ సినిమాను దిల్ రాజుకే ఇచ్చి తీరాల్సిన పరిస్థితి వల్ల నిర్మాత దాదాపు రెండు మూడు కోట్ల వరకు నష్టపోయారని తెలుస్తోంది. ఇకపై ఇలా జరగకుండా వుండడానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు బోగట్టా.
థియేటర్ల విషయంలో ఈ సంక్రాంతికి జరిగినట్లు ఇకపై జరగకుండా వుండాలంటే, ప్రతి జిల్లాలో కొన్ని థియేటర్లు వున్నవారిని సమీకరించి, సిండికేట్ చేస్తే బెటర్ అన్న ఆలోచన టాలీవుడ్ లోని కొందరు నిర్మాతలకు స్టార్ట్ అయింది. గిల్డ్ లో ఇటీవల మీడియాను కంట్రోలు చేయాలన్న దిల్ రాజు ఆలోచన కు కూడా చుక్కెదురయినట్లు బోగట్టా. ఆఖరికి ఆఖరి మీటింగ్ లో ఇక ఈ మీడియా కంట్రోలు విషయం వదిలేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద యంగ్ జనరేషన్ బాగా పెరుగుతుండడం వల్ల టాలీవుడ్ లో దిల్ రాజకు గట్టి పోటీ ఎదురవుతున్నట్లే కనిపిస్తోంది.