శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం. ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేది కిడ్నీ బాధితుల విషాదమే. ఏళ్ల తరబడి ఈ దారుణమైన సమస్య ఉంది. కానీ పట్టించుకునే పాలకులే లేరు. చంద్రబాబు సీఎం గా ఉండగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్ధానం కిడ్నీ బాధితుల గురించి గట్టిగానే మాట్లాడారు, కానీ బాబు చేత కనీస సాయం చేయించలేకపోయారు.
జగన్ సీఎం అయ్యాక కిండీ పేషంట్లకు పది వేల రూపాయల పెన్షన్ తో పాటు డయాలసిస్ సెంటర్, అత్యాధునిక పడకల ఆసుపత్రి వంటివి వరంగా ఇచ్చారు. ఇపుడు మరో బ్రుహత్తర కార్యక్రమాన్ని తలపెట్టబోతున్నారు. అదేంటి అంటే ఉద్ధానం సహా శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ ప్రభావిత ప్రాంతాల ప్రజానీకానికి రక్షిత మంచినీరు అందించడం.
దాని కోసం ఏకంగా ఏడువందల కోట్ల రూపాయలతో భారీ పధకానికి జగన్ శ్రీకారం చుట్టారు. భూగర్భ జలాల్లోని కలిషితమైన, విషపూరితమైన నీటిని తాగుతూ కిడ్నీ రోగాలను తెచ్చుకుంటున్న ప్రభావిత గ్రామాల్లోని అయిదారు లక్షల మంది ప్రజానీకానికి ఈ భారీ పధకం ద్వారా పూర్తి ప్రయోజనం దక్కుతుంది.
అంతే కాదు కిడ్నీ వ్యాధులు భవిష్యత్తులో రాకుండా శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. ఈ పధకాన్ని త్వరలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని మంత్రి సీదరి అప్పలరాజు తెలియచేస్తున్నారు. దీనివల్ల ఉద్ధానం సమస్యకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి ఉద్ధానం మీద ఎవరెన్ని చెప్పినా, మరెంతగా షో చేసినా ఆదుకునేది, ఉద్ధరించేది మాత్రం జగనేనని మరో మారు రుజువు అయిందని వైసీపీ నేతలు అంటున్నారు.