ఇంద్రగంటి-నాని-సుధీర్ కుమార్ కాంబినేషన్ లో తయారైన సినిమా వి. ఈ సినిమా నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్న కొద్దీ దీనిపై ఇండస్ట్రీలో కాస్త నెగిటివ్ వినిపించేది. అయితే ఇండస్ట్రీలో ఇలాంటివి మామూలే. దిల్ రాజు టేస్ట్, ఇంద్రగంటి టేకింగ్ కచ్చితంగా వర్కవుట్ అవుతుందనే అనుకుంటూ వచ్చారు అంతా. అయితే ఎప్పడయితే ఈ సినిమాకు 35 కోట్లకు పైగా ఖర్చయిందని వార్తలు వచ్చాయో? దీని నుంచి దిల్ రాజు ఎలా బయటపడతారు? అనే కామెంట్లు వినిపించడం ప్రారంభమైంది.
ఇలాంటి నేపథ్యంలో కరోనా వచ్చి, థియేటర్లు మూతపడి, పరిస్థితులు అంతా తల్లకిందులు అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో థియేటర్లు తీసినా, జనం వస్తారా? వచ్చినా, ఇలాంటి థ్రిల్లర్లు చూడడానికి రిస్క్ చేసి ఫ్యామిలీలు వస్తాయా? అలా రాకపోతే పరిస్థితి ఏమిటి? అందుకే ఆఖరికి ఓటిటి దారి పట్టారు.
ఇలా చేయడం వల్ల దిల్ రాజుకు కనీసం పది కోట్ల రిస్క్ తప్పిందని ఆయన సన్నిహిత వర్గాల బోగట్టా. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఓటిటిలో విడుదలవుతుంది వి సినిమా. టాక్స్ లు, జీఎస్టీలు అన్నీ పోను 31 కోట్ల ఆదాయం వచ్చింది దాని ద్వారా. గతంలోనే హిందీ రైట్స్ అమ్మేసారు. దాని వల్ల ఓ ఆరుకోట్ల వరకు వచ్చింది.మొత్తం మీద 37 కోట్లు సమకూరి, లాభం లేదు, నష్టం లేదు అనే పరిస్థితి వచ్చింది.
పైగా అమెజాన్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం వన్ వీక్ పాటు థియేటర్లలో కూడా ప్రదర్శించుకోవచ్చు. మంచి టైమ్ చూసుకుని, బి సి సెంటర్లలో వేసుకుంటే ఒకటో రెండో వస్తాయి. కానీ ఇలా ఓటిటికి ఇవ్వకపోయి వుంటే విడుదల అడ్వాన్స్ లు అయినా,కలెక్షన్లు అయినా, మొత్తం మీద నష్టమే వుండేదని దిల్ రాజు అంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వి కథ ఆ విధంగా సుఖాంతమైంది.