మలయాళ నటి భావన కిడ్నాప్ వ్యవహారం పూర్తిగా మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై ఆది నుంచి అనుమానితుడిగా ఉండిన ఆ భాష స్టార్ హీరో దిలీప్ ను అరెస్టు చేశారు పోలీసులు. దిలీప్ ను పద్నాలుగు రోజుల రిమాండ్‌కు పంపించారు. మరి ఒక భాషలో స్టార్ స్టేటస్ ను కలిగిన హీరోని అరెస్టు చేయడం అంటే మాటలు కాదు.
అది కూడా తన సాటి హీరోయిన్ పై కిడ్నాప్, లైంగికదాడి వ్యవహారంలో స్టార్ హీరో అరెస్టు కావడం ఎంత తీవ్రమైన విషయమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భావన కారు డ్రైవర్, మాజీ డ్రైవర్, వారి స్నేహితులు కలిసి కొన్నాళ్ల కిందట ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు భావన.
దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పల్సర్ సునీ అతడి స్నేహితులు తనను కిడ్నాప్ చేశారని, కారులో తనను తీసుకెళ్లి కొన్ని గంటల పాటు చిత్రహింసలు పెట్టారని భావన తన ఫిర్యాదులో పేర్కొంది. కొన్ని ఆంగ్ల పత్రికలు అయితే .. భావనపై రేప్ జరిగిందని కూడా రాసేశాయి. అయితే జరిగిన ఘాతుకాన్ని సెన్సిటివ్ గా తీసుకొంటే.. రేప్ అనే మాట అనవసరమే.
జరిగింది దాడి మాత్రమే. ఈ వ్యవహారంలో ఆది నుంచి దిలీప్ పేరు వినిపించ సాగింది. పాత కక్షల నేపథ్యంలో దిలీప్ ఈ పని చేయించాడనే మాట వినిపిస్తూ వస్తోంది. అయితే ఇన్నాళ్లూ ఈ వ్యవహారాన్ని పోలీసులు కూడా నాన్చారు. కానీ.. పల్సర్ సునీ జైలు నుంచి దిలీప్ కు ఒక లేఖ రాయడం, మీ పేరు చెప్పనందుకు ప్రతిఫలంగా డబ్బులు ఇవ్వాలని అతడు కోరడం.. ఆ లెటర్ ను దిలీప్ తెచ్చి పోలీసులకు ఇవ్వడంతో వ్యవహారం మలుపుతిరిగింది.
పల్సర్ సునీ అంటే తనకు ఎవరో తెలియదని.. కానీ అతడు జైలు నుంచి లెటర్ రాశాడని… దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తతంగం అలా నడుస్తుండగానే.. ఇప్పుడు పోలీసులు దిలీప్ ను అరెస్టు చేశారు. పక్కా ఆధారాలు లభించాయని, భావనపై దాడికి సూత్రధారి దిలీపే అని పోలీసులు చెబుతున్నారు.
పల్సర్ సునీ, అతడి స్నేహితులకు దిలీప్ కోటిన్నర రూపాయలు ఇచ్చి.. దాడిని చేయించాడని పోలీసులు చెబుతున్నారు. దీనిపై విచారణకు గానూ దిలీప్ ను అరెస్టు చేశారు. జ్యూడీషియల్ రిమాండ్ కు పంపించారు. మరి వ్యవహారం చూస్తుంటే.. ఈ స్టార్ హీరో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయినట్టుగా ఉన్నాడు. ఈ వ్యవహారం ఇంకా ఎంత వరకూ వెళుతుందో చూడాలి.