మలయాళ నటుడు దిలీప్ పతనావస్థ పై పోలీసులు సంచలన విషయాలను ప్రకటిస్తున్నారు. ఒక్క చోట పతనం అయిన దిలీప్.. అక్కడ నుంచి ఒక్కో స్టెప్ జారుతూ, జైలు వరకూ వచ్చాడని కేరళ పోలీసులు చెబుతున్నారు. పక్కా ఆధారాలున్నాయి… దిలీప్ వ్యక్తిగత కక్షతోనే భావనపై దాడి చేయించాడు, అత్యంత దారుణమైన కుట్రను పన్నాడు.. దీని కోసం మనుషులను మాట్లాడాడు, ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టి భావనపై దాడి చేయించాడు..
ఇదంతా అతడి వ్యక్తిగత కక్ష మాత్రమే, భావనపై అత్యంత దుర్మార్గంగా దాడి చేయించాలని దిలీప్ భావించాడు.. అని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన దిలీప్ కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దిలీప్ ను పోలీసు విచారణకు అప్పజెప్పింది. బెయిల్ గురించి రెండ్రోజులు ఆగి దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది. ఇప్పటికే దిలీప్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు.
అరెస్టు చేయక ముందే.. రెండు రోజుల పాటు దిలీప్ ను పోలీసులు విచారించారు. ఒక్కో రోజు పన్నెండు గంటల పాటు విచారణ సాగిందంటే.. పోలీసులు ఎంత డీప్ గా విచారించారో అర్థం చేసుకోవచ్చు. అప్పుడే పోలీసులకు కావాల్సినన్ని ఆధారాలు లభించాయని తెలుస్తోంది. భావనపై దాడికి దిలీపే సూత్రధారి అని పోలీసులు దగ్గర ఇరవై రకాల ఆధారాలున్నాయని తెలుస్తోంది.
ఆ ఆధారాల మేరకు పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం.. దిలీప్ కు చాలా సంవత్సరాల నుంచి కావ్య మాధవన్ తో అక్రమ సంబంధం ఉంది. అయితే మంజూవారియర్ అనే హీరోయిన్ నే దిలీప్ అప్పటికే పెళ్లి చేసుకున్నాడు. కావ్యతో దిలీప్ కు గల అనుబంధాన్ని భావన మంజూకు తరచూ తెలియజేయసాగింది. దీంతో మంజు దిలీప్ కు విడాకులు ఇచ్చింది. అప్పటికే కావ్య కూడా వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది.
ఇక్కడ దిలీప్, మంజులు విడిపోవడంతో కావ్య తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇటీవలే దిలీప్, కావ్యలు వివాహం చేసుకున్నారు. మరి ఈ రకంగా దిలీప్ తన ప్రియురాలితో దగ్గరైపోయినా.. భావనపై మాత్రం తీవ్రమైన కసిని పెట్టుకున్నాడు. తన అక్రమ సంబంధం వ్యవహారం మంజుకు చెప్పింది భావనే అనే కక్షతో ఆమెపై దాడి చేయించాలని దిలీప్ అనుకున్నాడు.
అందుకోసం నాలుగేళ్ల కిందటే ప్రణాళిక రచించాడు. భావనను కిడ్నాప్ చేయాలని.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడాలని, నగ్నంగా పొటోలు, వీడియోలు తీసి.. ఆమె జీవితాన్ని నాశనం చేయాలని దిలీప్ పక్కా విలన్ లా స్కెచ్ వేశాడు. భావనకు దగ్గరగా మెలగగల.. డ్రైవర్, మాజీ డ్రైవర్లకు ఈ పని అప్పజెప్పాడు.. చివరకు దాడిని చేయించగలిగాడు.
ఇందులో దిలీప్ కుట్రదారుడు.. అనే మాట తొలి రోజు నుంచినే వినిపించింది. అయితే పోలీసుల చర్యలు కాస్త నెమ్మదిగా సాగాయి.. చివరకు దిలీప్ జైలు పాలయ్యాడు.. ఈ కేసు విషయంలో పినరాయి విజయన్ ప్రభుత్వం గట్టిగానే ఉంది. దీంతో దిలీప్ కు ఉచ్చుబిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.